
మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల జలవనరులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడంతో నీటి ప్రవాహం దిగువకు చేరి, తెలంగాణలోని ప్రాజెక్టులను నింపేస్తోంది. ముఖ్యంగా జూరాల డ్యామ్, శ్రీశైలం జలాశయాలు వరదనీటితో నిండుతున్నాయి. వరద నీటితో జూరాల డ్యామ్ ఇప్పటికే నిండు కుండలా మారింది. ఈ సీజన్ లో రెండోసారి అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.
దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది.ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చేసింది. ఇది వర్షాల తీవ్రత, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటికి నిదర్శనం. అయితే, డ్యామ్ నుంచి ప్రస్తుతానికి నీటిని వదలడంలేదని తెలిపారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 854.20 అడుగులకు చేరింది.
శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు, ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరిందని అధికారులు వివరించారు. శ్రీశైలం డ్యామ్ కుడి, ఎడమ వైపు ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రస్తుతం నిలిపివేశారు. ఇది ఒకవైపు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్య కాగా, మరోవైపు నీటి మట్టం పెరిగే దాకా విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాగా, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ఆదివారం సాయంత్రం 3 స్పిల్ వే గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.130 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థం 9.657 టిఎంసిలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 8.869 టిఎంసిలుగా నమోదైంది. ఇన్‌ఫ్లో 53 వేల క్యూసెక్కులు నమోదు కాగా దిగువకు శ్రీశైలం వైపు 12,303 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్