ఫోర్డో అణుకేంద్రం అమెరికా దాడులకు ముందే తరలింలింపు?

ఫోర్డో అణుకేంద్రం అమెరికా దాడులకు ముందే తరలింలింపు?

* అమెరికా 12 బంకర్‌ బస్టర్‌ బాంబులు సరిపోలేదా?

ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్టెల్త్‌ బాంబర్లతో ఆదివారం జరిపిన దాడులలో కీలకమైన ఫోర్డో అణుకేంద్రం ఒకటి. దీనిపై సైతం అమెరికా బంకర్‌ బస్టర్‌ బాంబులు ప్రయోగించింది. అయితే, అగ్రరాజ్యం దాడులను ముందే పసిగట్టిన ఇరాన్‌ ఫోర్డో అణుకేంద్రం నుంచి అవసరమైన కీలకమైన సామగ్రిని రహస్య స్థావరానికి తరలించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. 
 
జూన్‌ 19, 20 తేదీలకు సంబంధించిన హైల్ల్యూషన్‌ ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రాల్లో ఫోర్డో అణు కేంద్రానికి సమీపంలో భారీ ట్రక్కుల కదలిక ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 19న ఫోర్డో అణు కేంద్రం సమీపంలో దాదాపు 16 కార్గో ట్రక్కులు బారులు తీరి కనిపించాయి. అలాగే, జూన్ 20న కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. దాంతో కీలమైన పరికరాలను తరలించినట్లుగా అనుమానిస్తున్నారు. 
 
ఇరాన్‌ అణుకేంద్రానికి సంబంధించిన సామగ్రినంతా విజయవంతంగా తరలించిందా? తరలిస్తుండగానే అమెరికా దాడులు చేసిందా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు. అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో అణు కేంద్రాన్ని నాశనం చేసింది. ఫోర్డో అణు కేంద్రం భూగర్భంలో నిర్మించగా సాధారణ మిస్సైల్స్‌తో నాశనం చేయడం అసాధ్యం. ఇజ్రాయెల్ సైతం ఇంతకుముందు దాడులు చేసి పెద్దగా ప్రభావం కనిపించలేదు. 
 
తాజాగా అమెరికా ప్రత్యేకమైన బీ-2 స్టెల్త్ బాంబర్‌ నుంచి బంకర్‌ బస్టర్ బాంబులతో దాడులకు పాల్పడింది. సొరంగాలు, బంకర్లను నాశనం చేసేందుకు ఈ బంకర్‌ బాంబులను ఉపయోగిస్తారు. ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా 30 వేల పౌండ్ల బరువున్న ఆరు బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ప్రయోగించిందని, దాంతో భారీగా నష్టం కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోర్డో అణుకేంద్రం ధ్వంసమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. 
 
దాడులపై ఆయన మాట్లాడుతూ ఇరాన్‌లో శాంతి మార్గంలో పయనించేందుకు ఇంకా సమయం ఉందని, అది యుద్ధాన్ని ఆపాల్సి ఉందని పేర్కొన్నారు. ఇరాన్‌ ఇప్పుడు దాడి చేస్తే తాము సైతం దాడులు చేస్తామని స్పష్టం చేశారు. శాంతి లేకపోతే, విధ్వంసం ఉంటుందని పేర్కొంటూ అన్ని లక్ష్యాలపై ఇంకా దాడి జరగలేదని తెలిపారు. త్వరలోనే శాంతి నెలకొనకపోతే ఇతర లక్ష్యాలపై ఖచ్చితత్వం, వేగం, నైపుణ్యంతో దాడి చేస్తామని హెచ్చరించారు.
 
కాగా, అమెరికా దాడులు చేసిన మూడు అణు కేంద్రాల్లో ఎటువంటి కాలుష్య కారకాలు విడుదల కాలేదని ఇరాన్ పేర్కొంది. దాడుల తర్వాత తమ రేడియేషన్ డిటెక్టర్లు ఎటువంటి హానికర రేడియోధార్మిక పదార్థాలను విడుదలను చేయలేదని ఇరాన్ మీడియా ఒక ప్రకటనలో తెలిపింది. ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్‌ అణు కేంద్రాల సమీపంలో నివసించే ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించింది. గతంలోనూ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపినప్పుడు రేడియోధార్మిక పదార్థాలు విడుదల కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది.
 
కాగా,.ఫోర్డో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా 12 బంకర్‌ బస్టర్‌ బాంబు (జీబీయూ-57)లను ప్రయోగించినా కచ్చితత్వం లేకపోవడం వల్ల ట్రంప్‌ చెప్పినట్టుగా ఫోర్డో అణు కేంద్రమేమీ ‘తుడిచిపెట్టుకు’పోలేదని అమెరికాకు చెందిన విశ్వసనీయ వర్గాలే తెలిపినట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఒక కథనంలో వెల్లడించింది.