ఇరాన్‌ డ్రోన్‌ యూనిట్‌ కమాండర్‌ను హతమార్చాం

ఇరాన్‌ డ్రోన్‌ యూనిట్‌ కమాండర్‌ను హతమార్చాం

* ఇరాన్‌ అణు కేంద్రాలపై ఇజ్రాయిల్‌ భీకర దాడులు

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరింది. టెహ్రాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ జరుపుతున్న ఈ దాడుల్లో ఇరాన్‌వైపు భారీ నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్‌కు చెందిన పలువురు కీలక కమాండర్లు మృతి చెందిన విషయం తెలిసిందే.   తాజాగా ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ వైమానిక దళం డ్రోన్‌ యూనిట్‌ కమాండర్‌ అమీన్ జుడ్ఖిని హతమార్చినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.

ఇటీవలే టెల్‌ అవీవ్‌పై ఇరాన్‌ చేసిన డ్రోన్‌ దాడుల వెనుక అతని హస్తం ఉన్నట్లు పేర్కొంది. ఇరాన్‌లోని అహ్వాజ్‌ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ భూభాగం వైపు వందలాది డ్రోన్‌ దాడులకు అతడు ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఇరాన్‌లోని కీలక అణు కేంద్రానికి నిలయమైన ఇస్ఫహాన్ నగరంపై ఇజ్రాయెల్‌ దళాలు దాడులు జరిపినట్లు ఇరాన్‌ తాజాగా పేర్కొంది. అయితే, ఈ దాడిలో ఎలాంటి ప్రమాదకర వాయువులు లీక్‌ అవ్వలేదని తెలిపింది. 

అక్కడ అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దాడులతో ఇస్ఫహాన్ నగరం పేలుళ్లతో దద్దరిల్లినట్లు తెలిపింది. మరోవైపు ఖొండాబ్ అణు పరిశోధనా రియాక్టర్ సమీపంలోని ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్‌ దాడులు జరిపినట్లు పేర్కొంది. మరోవైపు టెహ్రాన్‌లోని డజనుకుపైగా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి 60కి పైగా తమ ఫైటర్‌ జెట్లు దాడి చేశాయని, 120కిపైగా బాంబులను ప్రయోగించాయని ఇజ్రాయెలీ వైమానిక దళం శుక్రవారం వెల్లడించింది.

క్షిపణి భాగాలను తయారుచేసే సైనిక పారిశ్రామిక ప్రదేశాలపైన, క్షిపణి ఇంజిన్ల కోసం ఉపయోగించే ముడి పదార్థాలను తయారు చేసే ప్రదేశాలపైన ఫైటర్‌ జెట్లు దాడి చేసినట్లు ఎక్స్‌ వేదికగా ఇజ్రాయెల్‌ వైమానిక దళం తెలిపింది.  ఏళ్ల తరబడి వీటిని ఇరాన్‌ నిర్మించుకుందని, ఇరాన్‌ రక్షణ శాఖకు, అణు కార్యక్రమానికి ఈ పారిశ్రామిక కేంద్రం అత్యంత కీలకమని తెలిపింది. వీటితోపాటు ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని పెంచేందు కోసం అధునాతన ఆయుధాల పరిశోధన, అభివృద్ధి కోసం ఉపయోగించే టెహ్రాన్‌లోని ఎస్‌పీఎన్‌డీ కేంద్ర కార్యాలయంపైన కూడా ఫైటర్‌ జెట్లు దాడి చేశాయని తెలిపింది. 

ఇజ్రాయెల్‌పై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ఇరాన్‌లోని మూడు క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్‌ వైమానిక దళం పేర్కొంది. అయితే దాడులు ఆగేంత వ‌ర‌కు అణు చ‌ర్చ‌లు ఉండ‌బోమ‌ని ఇరాన్ స్ప‌ష్టం చేసింది. దాడుల స‌మ‌యంలో త‌మ న్యూక్లియ‌ర్ ప్రోగ్రామ్‌పై చ‌ర్చించ‌లేమ‌ని ఇరాన్ వెల్ల‌డించింది. ఇరాన్‌తో సుదీర్ఘ పోరు త‌ప్ప‌ద‌ని ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ మంత్రి వార్నింగ్ ఇచ్చిన నేప‌థ్యంలో ఆ దేశం ఈ విష‌యాన్ని పేర్కొన్న‌ది.

మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలు, నిర్ణయాలపై చర్చించేందుకు జెనీవాలో యురోపియన్‌ విదేశాంగ మంత్రులు ఇరాన్‌ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతున్నారు. బ్రిటీష్‌ విదేశాంగమంత్రి డేవిడ్‌ లామీ జర్మనీ, ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రులతో కలిసి ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌తో భేటీ అయ్యారు. రాబోయే రెండు వారాల్లో దౌత్య పరిష్కారాన్ని కనుగొనడానికే ఈ ప్రయత్నాలన్నీ అని డేవిడ్‌ వ్యాఖ్యానించారు.