
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో భద్రతా లోపానికి కారణమైన ఎయిరిండియాకు చెందిన ముగ్గురు అధికారులపై వేటు పడింది. డివిజనల్ ఉపాధ్యక్షుడు సహా ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియాను ఆదేశించింది. సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టర్ బాధ్యతల నుంచి ఆ ముగ్గుర్ని తప్పించాలని సూచించింది. వారిపై అంతర్గత క్రమశిక్షణకు సంబంధించి విచారణ జరిపి పది రోజుల్లో నివేదిక సమర్పించాలని డీజీసీఏ సూచించింది. వారు పదేపదే నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది.
“ఆ ముగ్గురు అధికారులను అన్ని షెడ్యూలింగ్, రోస్టరింగ్ విధుల నుంచి తొలగించండి. అంతర్గత క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. దీనిపై 10 రోజుల్లోపు మాకు నివేదిక ఇవ్వండి. ఆ ముగ్గురు అధికారులను నాన్-ఆపరేషన్ విధులకు మాత్రమే పరిమితం చేయండి. భవిష్యత్ ఆడిట్/ తనిఖీల్లో ఏమైనా ఉల్లంఘటనలు జరిగినట్లు గుర్తిస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. జరిమానాలు, లైసెన్స్ సస్పెన్షన్, ఆపరేటర్ అనుమతుల ఉపసంహరణ లాంటి కఠిన చర్యలు తప్పవు” అని డీజీసీఏ ఆదేశించింది.
కాగా, డీజీసీఏ ఆదేశాలను అమలు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. సదరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ‘ఇకపై ఐఓసీసీ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. భద్రత ప్రోటోకాల్‌లను కచ్చితంగా పాటిస్తాం’ అని పేర్కొంది. విమాన ప్రయాణ సమయ నియమాలను ఉల్లంఘించినందుకు డీజీసీఏ- ఎయిర్ ఇండియా అకౌంటబుల్ మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
“స్పాట్ చెక్ సమయంలో, ఎయిర్ ఇండియా అకౌంటబుల్ మేనేజర్ మే 16, 17 తేదీల్లో బెంగళూరు నుంచి లండన్‌కు రెండు విమానాలు నడిపారని గుర్తించాం. ఈ రెండూ నిర్దేశిత 10 గంటల సమయ పరిమితి కంటే మించిపోయాయి. ఇది సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ నిబంధనలను ఉల్లంఘించడమే. దీనిపై 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. లేకుంటే తగు చర్యలు తీసుకుంటాం” అని డీజీసీఏ నోటీస్‌లో పేర్కొంది.
More Stories
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల కలర్ ఫొటో!
పంట వ్యర్థాల దహనంపై చర్యలు లేదా జైలు .. సుప్రీం
16 వేల మంది విదేశీయులు దేశం నుంచి బహిష్కరణ