తెలంగాణా పోలీసులు వెయ్యి మంది ఫోన్లు ట్యాపింగ్!

తెలంగాణా పోలీసులు వెయ్యి మంది ఫోన్లు ట్యాపింగ్!
 
* మావోయిస్టుల పేరిట 600ఫోన్లు ట్యాపింగ్ 

బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023 ఎన్నికలకు రెండు నెలల ముందు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వెయ్యి మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసిన ట్లు ఈ విచారణలో గుర్తించారు. అయితే ఇప్పటివరకు పూర్తిగా సాంకేతికంగా, శాస్త్రీయంగా విశ్లేషించి 600 ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు లో పోలీసులు నిర్థారించినట్లు తెలిసింది. బాధితుల్లో జర్నలిస్టులు, సినీ, ప్రతిపక్ష నేతలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నారు.

మావోయిస్టుల పేరు చెప్పి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు సిట్ విచారణలో తేలింది. సాధారణ ఎన్నికల సమయంలో మావోయిస్టులు క్రియాశీలకంగా మారారని చెప్పి, వారి కదలికలపై నిఘాకు అనుమతి కోరినట్లు రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలిసింది. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లను ప్రభాకర్ రావు ఇచ్చినట్లు తేలింది. 

హవాలా నిధులు మావోయిస్టులకు చేరవేస్తున్నారన్న సాకుతో వ్యాపారస్థుల నుంచి కోట్ల రూపాయిలు అనధికారికంగా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. సాధారణంగా పోలీసులు నగదు, ఇతర వస్తువులు ఏదైనా అధికారికంగా స్వాధీనం చేసుకుంటే ట్రెజరీకి జమ చేసి న్యాయస్థానానికి సమాచారం అందజేయాల్సి ఉంంటుంది. కానీ ఈ వ్యవహారంలో పూర్తిగా అనధికారికంగా కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని తమ సొంత అవసరాలకు వినియోగించినట్లు సమాచారం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై ప్రధానంగా ఫోకస్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  ఆ క్రమంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారు? అందుకు సంబంధించిన ప్రతి అంశం నాటి ఏపీ సీఎం, ఆమె సోదరుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి చేరవేసినట్లు సమాచారం.
 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలతోపాటు సొంత పార్టీల నేతలు, పలువురు జడ్జీలు, ఇతరుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫోన్లు ట్యాప్‌ అయిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, ఇతరుల వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, గద్వాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు సరిత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు నమోదు చేశారు.
 
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వాంగ్మూలం నమోదు కోసం బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌, రఘునందన్‌రావులను బుధవారం విచారణకు రావాలని సిట్‌ పిలిచినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ప్రభాకర్‌రావు బృందం ట్యాప్‌ చేసిందని.. ఆర్ధిక సాయం అందకుండా అడ్డుకోవడంతోపాటు వ్యూహాలను తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా నిఘా పెట్టిందని బీజేపీ నేతలు గతంలోనే ఆరోపించారు. 

అలాగే గద్వాల కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య కూడా తమ వాంగూల్మం ఇచ్చారు. ఈ ట్యాపింగ్ వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో సిట్ అధికారులకు వారు వివరించారు. సిట్ విచారణలో బాధితులు చెప్పిన వివరాల మేరకు ప్రభాకర్‌రావుతో పాటు నలుగురు నిందితులను కూడా కలిపి విచారించాలని సిట్ భావిస్తోంది. 

ప్రతి రోజు ప్రభాకర్‌రావు తమకు బ్రీఫింగ్ ఇచ్చే వారని నలుగురు నిందితులు సిట్ అధికారులకు తెలిపారు. పోల్ -2023 వాట్సాప్ గ్రూప్‌పై ప్రధానంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించనుంది. అప్పటి టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి సన్నిహితులు గాలి అనిల్, వినయ్ రెడ్డిల ఫోన్‌లు ట్యాప్ చేసి స్వాధీనం చేసుకున్న డబ్బుపై కూడా సిట్ ఆరా తీసింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్‌కు చెందిన కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్‌ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. 

2023 ఎన్నికల సమయంలో ట్యాపింగ్ బాధితుల్లో బిఆర్‌ఎస్ నేతలు,ఎంఎల్‌ఎల కూడా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది.