పాకిస్థాన్ లో సైన్యంకు మద్దతుగా ఉగ్రవాదుల ర్యాలీలు

పాకిస్థాన్ లో సైన్యంకు మద్దతుగా ఉగ్రవాదుల ర్యాలీలు
కాల్పుల విరమణ అంటూ భారత్ సైన్యం ముందు కాళ్లబేరానికి పాకిస్థాన్ లో ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీలను గమనిస్తుంటే భారత్ లో ఉగ్రదాడులు కుట్రలు సాగుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.  ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నిషేధిత సంస్థ జమాత్-ఉద్-దవా పాకిస్థాన్ లోని పలు నగరాల్లో భారత్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించ‌డామే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు.
 
లాహోర్, ఇస్లామాబాద్, కరాచీలాంటి నగరాలతో సహా మొత్తం 50 నగరాలలో భార‌త్‌కు వ్య‌తిరేకంగా ర్యాలీలను నిర్వ‌హించిన‌ట్టు స‌మాచారం. దీనిలో పాక్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ కూడా పాల్గొన‌డంపై సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. పీఎంఎంఎల్ సమావేశాలు సమాఖ్య, పంజాబ్, సింధ్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఎక్కువ ర్యాలీలు జరిగిన‌ట్టు తెలుస్తోంది.
 
కాదుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నిర్వహించిన ఈ ర్యాలీలలో పాక్ మంత్రులు, సైన్యం కూడా పాల్గొంటుంది. ఈ ర్యాలీల్లో ఉగ్రవాద నాయకుల ప్రసంగాలు, మంత్రుల మాటలు చూస్తుంటే పాకిస్తాన్ మరో దాడికి కుట్ర చేస్తోందని అనుమానం బలపడుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మే 28వ తేదీన  పంజాబ్ ప్రావిన్స్ లో భారత్ కు వ్యతిరేకంగా ఒక ర్యాలీ జరిగింది. ఇందులో ఆ దేశపు మంత్రులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు కలిసి వేదికను పంచుకున్నారు. 
 
పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇందులో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా పాల్గొంటున్నారు. వీరు భారత్ లో అశాంతిని రెచ్చగొట్టాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఉగ్రవాది హఫీజ్ సయీద్  భారత్ లో మరో దాడికి కుట్ర చేస్తున్నాడని, దాని కోసమే ఇప్పుడు పాకిస్థాన్ ఆర్మీకి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నాడని నిఘా వర్గాలు అంటున్నాయి. 
 
పాక్ ఆర్మీతో కలిసి భారత సైన్యాన్ని దెబ్బకొట్టేలా పుల్వామా మాదిరి దాడులకు కుట్ర పన్నుతున్నట్లు భావిస్తున్నారు.  అందుకనే అప్రమత్తంగా వ్యవహరిస్తున్న భారత సైన్యం సరిహద్దు ప్రాంతాలలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.