కవిత లేఖ దుమారం ఫ్యామిలీ డ్రామా

కవిత లేఖ దుమారం ఫ్యామిలీ డ్రామా

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కొట్టిపారేసారు.  ఈ మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమస్యగా అభివర్ణించారు. ఈ వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సం బంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 

కవిత చుట్టూ నెలకొన్న వివాదాలపై ఆయన వ్యాఖ్యానిస్తూ ‘ఇది పూర్తిగా డాడీ.. డాటర్, సిస్టర్.. బ్రదర్ మధ్య నడుస్తున్న సమస్య’ అని పేర్కొన్నారు. వారి కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో, వాళ్లు ఆడుతున్న డ్రామాలో బీజేపీ భాగస్వామి కాదని, కాబోదని స్పష్టం  చేశారు. ఈ అంశంపై బీజేపీ నాయకులు ఎవరూ స్పందించవద్దని కీలక సూచన చేశారు. 

తెలంగాణ ప్రజానీకానికి సైతం ఈ వివాదంతో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారంపై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఎవరు ఎవరితో చర్చలు జరిపారో బహిరంగంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నిరాధార ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు.

కాగా, భారత సైన్యం విజయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం పట్ల కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ జైహింద్ ర్యాలీ, సభల పేరుతో దేశ సైనికులను అవమానిస్తోందని మండిపడ్డారు. దేశమంతా గర్వపడే సైనిక చర్యలను ఒక పార్టీకి ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు.  సైన్యం సాధించిన విజయాలను దేశ ప్రజలందరూ పండుగలా జరుపుకుంటుంటే, రేవంత్ రెడ్డికి మాత్రం అవి బీజేపీ కార్యక్రమాలుగా కనిపించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

‘మన ఎంపీలు పార్టీలకు అతీతంగా ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారని, ’ఆపరేషన్ సిందూర్’ వంటివి ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. పీఓకేను పాకిస్థాన్‌కు అప్పగించింది ఎవరని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే పీఓకే అంశం ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉందని ఆయన ఆరోపించారు. గతంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడినప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం సంతాప ప్రకటనలతో సరిపుచ్చాయని కిషన్ రెడ్డి విమర్శించారు. 

కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అలా వ్యవహరించలేదని, పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని గుర్తు చేశారు. పహల్గామ్ దాడి అనంతరం పాకిస్థాన్‌కు ఎలాంటి నరకాన్ని చూపించామో యావత్ ప్రపంచం చూసిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ భద్రత, సైనిక చర్యల విషయంలో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. 

రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్‌కు ముందు పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చారని, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక రేవంత్ రెడ్డి మోదీ ట్రంప్ ఒత్తిడితో యుద్ధం ఆపారని, పీవోకే తీసుకునే శక్తి బీజేపీకి లేదని అనడం సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమేనని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.