
‘‘చాలా సార్లు కాంట్రాక్టులపై సంతకాలు జరగుతాయి. కానీ, ఆయుధాలు మాత్రం అందవు. ఇందులో టైమ్‌లైన్ అనేది ప్రధాన సమస్య. సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా నాకు గుర్తు రావట్లేదు. మనం చేయలేని పనికి వాగ్దానాలు చేయడం ఎందుకు? తేజస్ ఎంకే1 చాలా ఆలస్యమైంది. ఇక తేజస్ ఎంకే2 ప్రొటోటైప్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇక ఆమ్కా ఫైటర్‌కు సంబంధించి ఇప్పటివరకు ప్రొటోటైప్ కూడా రాలేదు” అని తెలిపారు.
“సమయానికి సరఫరా చేయడమనేది పెద్ద సమస్యగా మారింది. నాకు తెలిసి ఒక్క ప్రాజెక్టు కూడా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు” అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయానికి సరఫరా చేయలేనప్పుడు హామీ ఎందుకివ్వాలి? అని ప్రశ్నించారు. ముఖ్యంగా దేశీయంగా తయారయ్యే ప్రాజెక్టులు మరింత ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ఇందుకు లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌ఏటీ) ప్రోగ్రామ్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు.
తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాల తయారీకి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో 2021లో రూ.48 వేల కోట్లకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. 2024 మార్చి నుంచి విమానాలు డెలివరీ చేయాల్సి ఉన్నదని చెప్పారు. 83 విమానాలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటివరకు ఒక్కటి కూడా తమ చేతికి అందలేదని, తేజస్ ఎంకే-2 నమూనా ఇంకా సిద్ధం కాలేదని తెలిపారు.
“మన దళాలు- పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉంది. పారదర్శకత చాలా అవసరం ఉంటుంది. మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే దానిని అందించి తీరాల్సిందే. మేకిన్ ఇండియా కోసం వాయుసేన శక్తివంచన లేకుండా పని చేస్తోంది. మనం ఈ రోజు సంసిద్ధంగా ఉంటేనే భవిష్యత్తుకు సిద్ధం కాగలము. రానున్న పదేళ్లలో మన పరిశ్రమలు ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవు” అని చెప్పుకొచ్చారు.
కానీ, ప్రస్తుతానికి మనం త్వరగా చర్యలు తీసుకోవడం అవసరం అని పేర్కొంటూ దళాలను శక్తిమంతం చేసుకొంటేనే యుద్ధాలు గెలుస్తాం అని ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. “దేశీయంగా ఉత్పత్తి గురించే కాదు, స్వదేశీ డిజైన్లపైనా చర్చ జరగాలి. భద్రతా బలగాలకు, ఆయుధ కంపెనీలకు మధ్య సమన్వయం ఉండాలి. ఒకసారి ఒప్పందం చేసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. సమయానికి డెలివరీ ఇవ్వాలి” అని ఏపీ సింగ్ సూచించారు.
యుద్ధ రంగంలో వేగంగా మారిపోతున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ సలహా ఇచ్చారు. “మన నౌకాదళాధిపతి చెప్పినట్లు యుద్ధ రంగం వేగంగా మారిపోతోంది. ప్రతి రోజు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తున్నట్లు చూస్తున్నాం. ఆపరేషన్ సిందూర్‌తో మనం ఎక్కడ ఉన్నాం? భవిష్యత్తుకు ఏం కావాలనే దానిపై స్పష్టమైన అవగాహన వచ్చింది” అని చెప్పారు.
అయితే, మనం చేయాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు. ఆమ్కా ప్రాజెక్టును ప్రైవేటు సెక్టార్ కోసం కూడా క్లియర్ చేశారని, ఇది చాలా పెద్ద నిర్ణయం అని తెలిపారు. మన ప్రైవేటు రంగంపై దేశానికి ఆ రేంజ్ లో విశ్వాసం ఉందని పేర్కొంటూ భవిష్యత్తులో భారీ మార్పులకు ఇది బాటలు పరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!