ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌లో సైన్యం చూపించిన ధైర్య సాహసాలకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నట్లు చెప్పారు. 122వ మన్‌ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందని ప్రధాని స్పష్టం చేశారు. 

మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని, దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు ఎంతో సాహసం చూపారని మోదీ కొనియాడారు. ఆపరేషన్‌ సిందూర్‌తో దేశ ప్రజలందరూ భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు.

“ఉగ్రవాదానికి వ్యతిరకేంగా చేసే పోరాటంలో ఆపరేషన్​ సిందూర్​ కొత్త ఉత్సహాన్ని నింపింది. మన సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని తల ఎత్తుకునేలా చేసింది. కచ్చితత్వంతో పీవోజేకేలోని ఉగ్రవాద క్యాంపులపై సైన్యం జరిపిన దాడులు అద్భుతం. మొత్తం దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైంది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనేది ప్రతి భారతీయుడి సంకల్పం” అని ప్రధాని చెప్పారు.

“ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. మన సంకల్పం, ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనం. అనేక కుటుంబాలు దీనిని తమ జీవితాల్లో భాగంగా చేసుకున్నారు. ఆపరేషన్​ సిందూర్​ సమయంలో పుట్టిన పిల్లలకు సిందూర్ అని పేరు పెట్టారు” అని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో తిరంగ యాత్రలు నిర్వహించారని గుర్తు చేశారు.

మరోవైపు మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందని చెప్పారు. నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధించామని చెప్పారు. తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ఆయన ప్రశంసించారు.