ఎన్నికలు ఎగగొట్టేందుకై బాంగ్లా ఆర్మీ చీఫ్‌పై రుగుబాటు

ఎన్నికలు ఎగగొట్టేందుకై బాంగ్లా ఆర్మీ చీఫ్‌పై రుగుబాటు
తన పదవికి రాజీనామా చేస్తానని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్‌ యూనస్‌ హెచ్చరించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో దీనికి నిరసనగా రాజధాని ఢాకాలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన మద్దతుదారులు ప్రకటించారు. ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరపాలని సైన్యం పట్టుబడుతుండగా, ఎన్నికల్లేకుండానే ముహమ్మద్ యూనస్‌ను ఐదేళ్లపాటు పదవిలో కొనసాగించాలని ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్నారు. 
 
ముందు సంస్కరణలు-తర్వాతే ఎన్నికలు అంటూ నిరసనకారులు తమ పోస్టర్లలో డిమాండు చేశారు. దీని వెనుక ఉద్దేశ్యం యూనస్ కు కంటకప్రాయంగా తయారైన ఆర్మీ చీఫ్ జమాన్‌ పై తిరుగుబాటు ప్రయత్నంగా కనిపిస్తున్నది. విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారిన దరిమిలా సైన్యం నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామా చేసిన ప్రధాని షేక్‌ హసీనా గత ఏడాది ఆగస్టు 5న దేశం విడిచి భారత్‌కి పారిపోవడం తెలిసిందే. 
 
అదే విధంగా ఆర్మీ చీఫ్‌కి వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతోనే యూనస్‌ రాజీనామా బెదిరింపులు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అసమంజమైన డిమాండ్ల ద్వారా తమపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తే ప్రజా మద్దతుతో కార్యాచరణ చేపట్టవలసి వస్తుందని బంగ్లాదేశ్‌ ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మొహమ్మద్‌ యూనస్‌, ఆయన సహాయకులు శనివారం హెచ్చరించారు. 
 
దేశంలో డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకర్‌ ఉజ్‌ జమాన్‌, ఖలీదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. గడచిన తొమ్మిది నెలలుగా బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తికి, సంస్కరణల యత్నాలకు, న్యాయ ప్రక్రియకు, స్వేచ్ఛాయుత ఎన్నికలకు, ప్రభుత్వ విధి నిర్వహణకు ఆటంకం కలిగించే విధంగా ఎటువంటి చర్యలు జరిగినా ప్రజలతో సంప్రదించి అవసరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని యూనస్‌ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించింది.

 ప్రస్తుత రాజకీయ వాతావరణం, నిరసనల మధ్య తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్న కారణంగానే రాజీనామా చేయాలని యూనస్‌ యోచిస్తున్నట్లు విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న నేషనల్‌ సిటిజన్‌ పార్టీ(ఎన్‌సీపీ) కన్వీనర్‌, విద్యార్థి ఉద్యమ నాయకులలో ఒకరైన నహీద్‌ ఇస్లామ్‌ అంతకు ముందు రోజు పేర్కొన్నారు.

“ఎన్‌సీపీకి సారథ్యం వహించేందుకు నహీద్‌ ఫిబ్రవరిలో యూనస్‌ క్యాబినెట్‌కి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహం జమునలో యూనస్‌తో సమావేశమైన నహీద్‌ పదవిలో కొనసాగవలసిందిగా అభ్యర్థించారు” అని సమావేశానికి హాజరైన మరో ఎన్‌సీపీ నాయకుడు అరీఫుల్‌ ఇస్లాం అదీబ్‌ తెలిపారు. తాను పదవిలో కొనసాగలేనని, మరో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని విద్యార్థి నాయకులే ఏర్పాటు చేసుకోవాలని యూనస్‌ కోరినట్లు బంగ్లాదేశ్‌ దినపత్రిక ప్రొథోమ్‌ తెలిపింది.

కాగా, విద్యార్థులు, ఇస్లామిస్టు మూకలను తన సొంత సైన్యంగా వాడుకుంటున్న యూనస్‌ ఎన్నికలు నిర్వహించకుండా అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. 2026 జూన్‌లోగా ఎన్నికలు జరుగుతాయని యూనస్‌ చెబుతున్నప్పటికీ బీఎన్‌పీతోసహా వివిధ రాజకీయ పార్టీలు సత్వర ఎన్నికలను కోరుతున్నాయి. 

అయితే ఆర్మీ చీఫ్‌  వకర్‌-ఉజ్‌ జమాన్‌ మాత్రం యూనస్‌ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయనను పదవీచ్యుతుడిని చేసేందుకు విద్యార్థులు, ఇస్లామిస్టు మూకలను యూనస్‌ వాడుకునే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా బలంగా వ్యాపిస్తున్నాయి.

 దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం ప్రజా ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని ఆర్మీ చీఫ్ పునరుద్ఘాటించిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తానని యూనస్‌ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బంగ్లాదేశ్‌ అనధికార ప్రధానమంత్రిగా కొనసాగుతున్న యూనస్‌ పదవీకాలం ముగిసిపోతుంది.

“రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదు. మనకు అప్పగించిన పనులు, బాధ్యతలను నెరవేర్చడంలో అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయని మాత్రమే ఆయన అన్నారు. వాటిని అధిగమిస్తున్నామని కూడా తెలిపారు” అని సలహా మండలి సమావేశం అనంతరం  క్యాబినెట్‌ సలహాదారు వహియుద్దీన్‌ మహమూద్‌ శనివారం తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వంలోని సలహాదారులెవ్వరూ ఎక్కడికీ వెళ్లలేదని, తమకు అప్పగించిన విధులను వారు విస్మరించబోరని స్పష్టం చేశారు.