హైదరాబాద్‌లో స్లీపర్‌ సెల్స్‌ను గుర్తిస్తున్నాం

హైదరాబాద్‌లో స్లీపర్‌ సెల్స్‌ను గుర్తిస్తున్నాం
పహల్గమ్ ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ గురించి భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో సహితం  స్లీపర్‌ సెల్స్‌ విస్తృతంగా పనిచేస్తున్నట్లు చాలాకాలంగా భావిస్తున్నారు. తాజాగా విజయనగరం కుట్రకేసులో హైదరాబాద్ లోనే కలిసి, ఉగ్రదాడులు కుట్రపన్నిన్నట్లు వెల్లడైంది.  ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని స్లీపర్ సెల్స్ ను గుర్తిస్తున్నామని రాష్ట్ర డిజిపి డా. జి జితేందర్ తెలిపారు.
అనుమానితుల కదలికలపై నిఘా ఉంచుతున్నామని, అటువంటి వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. తాజాగా పట్టుబడిన ఉగ్ర కుట్ర సూత్రదారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.  ఉగ్ర కుట్రకు ఒక గ్రూపును ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారని, దీనిని కనిపెట్టి విచ్ఛిన్నం చేసినట్లు డీజీపీ వివరించారు. కాగా ఛత్తీస్గఢ్- తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న ఆపరేషన్ కగర్ ను కేంద్ర బలగాలు మాత్రమే నిర్వహించాయని డీజీపీ వెల్లడించారు. 
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 300 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు.  మిగిలిన వారు ఇంకెవరైనా ఉంటే వారంతా లొంగిపోవాలని డిజిపి సూచించారు.ఇలా ఉండగా, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో గతంలో వరద వచ్చినప్పుడు ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేశామని చెప్పారు. వివిధ విభాగాల్లో 1000 మందికి శిక్షణ ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ స్థాయిలో రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామని డీజీపీ స్పష్టం చేశారు. 

మిగతా సిబ్బంది శిక్షణలో ఉన్నారని చెప్పారు. వరదలు, విపత్తులు వచ్చినప్పుడు వరద బాధితులను రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ పని చేస్తుందని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం ఎన్డీఆర్ఎఫ్లోని వివిధ విభాగాలు ఐదు రాష్ట్రాల్లో శిక్షణ పొంది సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని డీజీపీ చెప్పారు. వరదలు వచ్చినప్పుడు ఎస్డీఆర్ఎఫ్ చేపట్టే సహాయ చర్యలపై హుస్సేన్సాగర్ జలాల్లో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.

చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై విచారణ కొనసాగుతోందని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. ప్రభుత్వం కమిటీని నియమించిందని, కమిటీ నివేదిక రాగానే ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన చెప్పారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.