నెలరోజులైనా చిక్కని పహల్గాం ఉగ్రవాదులు!

నెలరోజులైనా చిక్కని పహల్గాం ఉగ్రవాదులు!
జమ్ముకశ్మీర్​లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగి నెలరోజులైనా ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారులు ఇప్పటికీ తప్పించుకుని తిరగడం భద్రతా బలగాలకు సవాల్ అయింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, స్థానిక గుర్రం సవారీవాలా దుర్మరణం చెందారు. ఈ ఘటన ఎప్రిల్ 22న జరిగింది. వీరిని పట్టుకోవడానికి కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున నెలరోజులుగా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. 
 
బైసారం పచ్చిక బయళ్లలో ఆరోజు జరిగిన మారణహోమం చివరికి ఆపరేషన్ సిందూరకు దారితీసింది. పహల్గాం ఘటన తరువాత పలు ఎన్‌కౌంటర్లు జరిగాయి. పలువురు అగ్ర స్థాయి ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఘటనతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న వేల మంది అనుమానితులను ప్రశ్నించింది. 
 
వందల మందిని అదుపులోకి తీసుకోవటంతోపాటు దాదాపు వంద మందికిపైగా అనుమానితులపై ప్రజా భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి వేర్వేరు జైళ్లలో నిర్బంధించారు. గతంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు.  ముగ్గురు అనుమానితుల ఛాయాచిత్రాలను విడుదల చేసింది. 
 
అందులో ఒకరిని అనంతనాగ్‌కు చెందిన ఆదిల్‌ హుస్సేన్‌ తోకర్‌గా గుర్తించారు. మిగితా ఇద్దరు పాకిస్థాన్‌ పౌరులని తెలిపారు. ఆ ఇద్దరి పేర్లు అలీబాయ్‌ ఆకా తలాభాయ్‌, హసీం ముసా ఆకా సులేమన్‌ అని ప్రకటించారు. అనుమానితుల సమాచారం తెలిపినవారికి అధికారులు రూ.20 లక్షల రివార్డ్‌ ప్రకటించారు. వారి ఛాయాచిత్రాలను అనంతనాగ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో అంటించారు. 
 
అయితే ఇప్పటి వరకు వీరి ఆచూకీ కానీ జాడలు కానీ ఏ కోణంలోనూ నియా బృందాలు పసికట్టలేకపొయ్యాయి. దాడికి దిగి నెత్తురు పారించి వెళ్లిన వారు చిక్కకపోవడంతో పలు ఇతరత్రా చిక్కులు ఏర్పడుతున్నాయి. వీరు తిరిగి ఏదైనా దాడికి వ్యూహరచన చేస్తారా? స్థానికులు పూర్తి స్థాయిలో వీరికి సహకరిస్తూ వీరిని కాపాడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
ఉగ్రదాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నది కూడా స్పష్టత లేదు. నలుగురు లేదా ఆరుగురు ముష్కరులు పాల్గొన్నట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ఇంతవరకు ఈ దాడి సూత్రధారులు చిక్కుపడకుండా ఉండటం దర్యాప్తు సంస్థలకు చిక్కులు తెచ్చిపెట్టాయి. వీరు దొరికితే కానీ ఇతరత్రా సమాచారం రాబట్టుకోవచ్చు లేకపోతే దర్యాప్తు ముందుకు సాగదని ఆందోళన వ్యక్తం అవుతోంది. 
 
ముష్కరులను పట్టుకునేందుకు భద్రతాదళాలు అవిశ్రాంతంగా ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముష్కరులు ఇప్పటివరకు భద్రతాదళాల కన్నుగప్పి తప్పించుకున్నప్పటికీ వారు పట్టుబడే రోజు ఎంతోదూరం లేదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.