రూ.200 కోట్లతో కాళేశ్వర క్షేత్రం అభివృద్ధి

రూ.200 కోట్లతో కాళేశ్వర క్షేత్రం అభివృద్ధి
 
* సరస్వతీ నది పుష్కర సంరంభానికి అంకురార్పణ 
 
దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి రూ. 200 కోట్లు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని త్రివేణీ సంగమం వద్ద గురువారం ప్రారంభమైన సరస్వతీ నదీ పుష్కరాలకు సీఎం హాజరై పుష్కర స్నానమాచరించి, ముక్తీశ్వరస్వామికి అభిషేకం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం అభివృద్ధికి వెంటనే మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం మంత్రి శ్రీధర్‌బాబు రూ.100 కోట్లు అడిగారని, రూ.200 కోట్లు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఇక్కడ గోదావరి పుష్కరాల పనుల్లో భాగంగా ఆలయానికి సంబంధించి శాశ్వత అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. గోదావరి నది ఈ ప్రాంతానికి ఆశీర్వాదం లాంటిదని చెప్పారు.
 
తొలుత, 15 అడుగుల సరస్వతీ మాత ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా నిర్మించిన జ్ఞాన సరస్వతీ ఘాట్‌ను ప్రారంభించారు. వీఐపీ ఘాట్‌కు సరస్వతీ ఘాట్‌గా నామకరణం చేశారు. అనంతరం పుష్కర స్నానమాచరించి, సరస్వతీ మాతకు ప్రభుత్వం తరఫున చీర, సారెను సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో మహాదేవుని దర్శించుకుని, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. సరస్వతి నదీ ఒడ్డుకు చేరుకుని మహానదీహారతిలో పాల్గొన్నారు.

సరస్వతీ నది పుష్కర చరిత్రలో ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే తొలిసారి. 2013లో ఈ పుష్కరాల కోసం నాటి ప్రభుత్వం కేవలం రూ.14 లక్షలే కేటాయించింది. ప్రస్తుత పుష్కరాల కోసం సీఎం రేవంత్‌ రూ. 37 కోట్లు కేటాయించటంతో పాటు సరస్వతీమాత ఏకశిలా విగ్రహం, పుస్తక ఆకృతి విగ్రహాన్ని గోదావరి నది ఒడ్డున ఏర్పాటు చేశారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్‌లను భారీ హంగులతో నిర్మించారు. 

సరస్వతీ నది పుష్కర సంరంభానికి గురువారం అంకురార్పణ జరిగింది. స్వామీ మాధవానంద సరస్వతి తెల్లవారుజామున 5.44 గంటలకు శ్రీకారం చుట్టారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సరస్వతీ నదికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పంచామృతాలు సమర్పించారు. నదిలో పుణ్యస్నానమాచరించారు. 

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ పూజలు నిర్వహించారు. పుష్కరాల్లో తొలిరోజు సుమారు 20 వేలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అంచనా. 600 మంది వేద పండితులు పాల్గొన్నారు. గురువారం రాత్రి 8 గంటలకు కాశీ పండితులు నవరత్న హారతిని వైభవోపేతంగా నిర్వహించారు.