టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి

టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి
 
* ఐరాసలో భారత్‌ డిమాండ్!

జమ్ముకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి కారణమైన లష్కరే అనుబంధ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్‌ చేస్తోంది! ఐరాస ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రసంస్థల జాబితాలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులను తాజాగా భారత ప్రతినిధుల బృందం కలిసింది. పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించింది.

ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 శాంక్షన్స్‌ కమిటీకి పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించింది. ఉగ్ర దాడికి పాల్పడినట్లు రుజువు చేసే సాక్ష్యాధారాలను సమర్పించింది. అలాగే యూఎన్‌ ఆఫీస్‌ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్‌తో భేటీ అయింది. ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 శాంక్షన్స్‌ కమిటీ అల్‌ఖైదా, ఐసిస్‌, వాటికి సంబంధించిన ఇతర ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను పర్యవేక్షిస్తున్నది. ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణాలపై, ఆయుధాల సేకరణపై నిషేధం విధించడం వంటి చర్యలను ఈ కమిటీ ఆదేశిస్తుంది.

“న్యూయార్క్‌లో ఉన్న భారత ప్రతినిధుల బృందం బుధవారం కౌంటర్- టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులను కలిసింది. ఆంక్షల పర్యవేక్షణ బృందం, యూఎన్‌లోని ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపింది. యూఎన్‌ ఆఫీస్‌ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్‌తో భేటీ అయింది” అని అధికార వర్గాలు వెల్లడించాయి.

పహల్గాం మారణహోమానికి బాధ్యులుగా ప్రకటించుకున్న ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ సంస్థ, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొత్తగా ఏర్పడింది. ఇది పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ ల‌ష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ‌. ఉగ్రవాది షేక్‌ సాజిద్‌ గుల్‌ సుప్రీం కమాండర్‌గా, చీఫ్‌ ఆపరేషనల్‌ కమాండర్‌గా బాసిత్‌ అహ్మద్‌ దార్‌ ఆ ఉగ్రసంస్థ వ్యవహరిస్తున్నారు. ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్ను కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఉగ్రసంస్థగా ప్రకటించింది. 2023 జనవరి 6వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా యువతను నియమించుకుంటోందని హోంశాఖ తెలిపింది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పింది. ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభావితం చేస్తోందని, అందరినీ ప్రేరేపిస్తోందని వెల్లడించింది. పలువురి హత్యలకు కుట్రలు కూడా పన్నుతోందని పేర్కొంది.

కాగా, ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గాంకు దగ్గర్లో ఉన్న బైసరన్‌ లోయలో ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఉగ్రవాదులు కిరాతక చర్యకు పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చి, పర్యటకులను కాల్చి చంపారు. 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. కేవలం పురుషులనే లక్ష్యంగా చేసుకుని పాశవికంగా హత్య చేశారు. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. ఇప్పుడు ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించేలా ఐరాసలో కీలక చర్యలు ప్రారంభించింది.