కాల్పులు విరమించినా సరిహద్దులో అప్రమత్తంగా ఉన్నాం

కాల్పులు విరమించినా సరిహద్దులో అప్రమత్తంగా ఉన్నాం

కాల్పుల విరమణకు అంగీకారం తెలుపుతూనే పాకిస్తాన్ కు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. సరిహద్దులో తాము సర్వసన్నద్ధంగా, అప్రమత్తంగా ఉంటామని, పాకిస్తాన్ వల్ల భవిష్యత్తులో ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని భారత సాయుధ దళాలు ప్రకటించాయి. భారతదేశం కాల్పుల విరమణ నిర్ణయాన్ని ప్రకటించిన కాసేపటికే భారత వాయుసేన తరఫున వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌, నౌకాదళం తరఫున కమోడోర్ రఘు ఆర్ నాయర్, ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాబోయే రోజుల్లో పాకిస్తాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించకుంటే బుద్ధి చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కమోడోర్ రఘు ఆర్ నాయర్ తెలిపారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఏవైనా కార్యకలాపాలను ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇటీవలే పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చాలా బాధ్యతాయుతంగా దాడులు చేసిందని ఆయన చెప్పారు.

“పాకిస్థాన్కు చెందిన జేఎఫ్-17 యుద్ధ విమానం చేసిన దాడిలో భారత్‌కు చెందిన ఎస్‌400 గగనతల రక్షణ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణి స్థావరాలు దెబ్బతిన్నాయనేది పూర్తి అబద్ధం” అని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ తెలిపారు. “ఉగ్రవాద శిబిరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే సౌకర్యాలను మాత్రమే భారత సేనలు లక్ష్యంగా చేసుకున్నాయి. భారత్ దాడుల్లో పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. రాడార్లన్నీ దెబ్బతిన్నాయి” అని ఆమె పేర్కొన్నారు.

ఎస్‌-400, బ్రహ్మోస్‌ వ్యవస్థపై దాడి అవాస్తవం

కాగా, ఎస్‌-400, బ్రహ్మోస్‌ వ్యవస్థపై జెఫ్‌-17తో దాడి చేశామని పాకిస్థాన్‌ చెబుతోందని ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ మండిపడ్డారు. అది పూర్తిగా అబద్ధమన్నారు. సిర్సా, జమ్ము, పఠాన్‌కోట్‌, భటిండా, నలియా భుజ్‌ వైమానిక స్థావరాలపై దాడి చేశామన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. చండీగఢ్, వ్యాస్‌ ఆయుధాగారాలపై దాడి చేశామన్న పాకిస్థాన్‌ ప్రచారం కూడా అబద్ధమని ఆమె చెప్పారు.

ప్రార్ధనా మందిరాలపై భారత్‌ దాడులు చేస్తోందని పాకిస్థాన్‌ మీడియా సమావేశంలో చెప్పిందని, భారతదేశం ఒక లౌకిక దేశమని, తమ సైన్యం రాజ్యాంగ విలువలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. భారత సైన్యాలు పాకిస్థాన్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించాయని, వారి సైనిక స్థావరాలు, భూభాగాలు, వైమానిక స్థావరాలపై దాడులు చేశాయని తెలిపారు. ఇదే కాదు, పాకిస్థాన్‌లోని కర్దు, సర్గోదా, జకోబాబాద్‌లోని వాయుసేన స్థావరాలను భారత్ ధ్వంసం చేసిందని, పాకిస్థాన్ రాడార్‌, వాయు రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసిందని చెప్పారు.