రూ.300 కోట్లతో లక్నోలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్

రూ.300 కోట్లతో లక్నోలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్
భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్,  ఇతర రక్షణ ప్రాజెక్టులు ఆదివారం ప్రారంభం కానున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా వీటిని ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.300 కోట్ల వ్యయంతో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్‌ను నిర్మించారు. 
 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మే 11న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా దీనిని ప్రారంభిస్తారు. అలాగే ఏరోస్పేస్, రక్షణ రంగాలకు పదార్థాలను ఉత్పత్తి చేసే టైటానియం, సూపర్ అల్లాయ్స్ మెటీరియల్స్ ప్లాంట్ (స్ట్రాటజిక్ మెటీరియల్స్ టెక్నాలజీ కాంప్లెక్స్) నిర్మాణానికి శంకుస్థాన చేస్తారు. ఈ కాంప్లెక్స్‌లో డిఫెన్స్ టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ (డీటీఐఎస్‌)ను కూడా అభివృద్ధి చేస్తారు.

కాగా, 2021 డిసెంబర్‌లో బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 80 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడమేగాక నిర్మాణ పురోగతిని నిశితంగా పరిశీలించిందని ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏసీఈవో శ్రీహరి ప్రతాప్ షాహి తెలిపారు. కేవలం 3.5 సంవత్సరాలలోపు ఈ ప్రాజెక్ట్‌ పూర్తైందని చెప్పారు. లక్నో నోడ్‌ ఇతర రక్షణ పరికరాలను కూడా ఉత్పత్తి చేస్తుందని, నగరంతోపాటు రాష్ట్రానికి రక్షణ రంగంలో కొత్త గుర్తింపును ఇస్తుందని అన్నారు. మరోవైపు తమిళనాడు తర్వాత దేశంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేసిన రెండవ రాష్ట్రం ఉత్తరప్రదేశ్.