దేశవ్యాప్తంగా 259 చోట్ల మాక్‌డ్రిల్స్

దేశవ్యాప్తంగా 259 చోట్ల మాక్‌డ్రిల్స్
* సాధారణ పౌరులుగా బిజెపి ఎంపీలు, నేతలు కూడా పాల్గొనాలి
 
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో  శత్రువుల నుంచి దాడులు ఎదురైన పక్షంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై మే 7న (బుధవారం) సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌  నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జరిపిన కీలక సమావేశంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు.
ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరి 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్‌లు ఉన్నాయి.  బుధవారం మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కశ్మీర్‌, గుజరాత్‌, హిర్యాణా, అస్సాం, రాజస్థాన్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్‌కు ఏర్పాట్లు చేశారు. మెట్రోలు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణ పైన మాక్ డ్రిల్ జరగనుంది.

కాగా, ఈ కార్యక్రమంలో బిజెపి ఎంపీలు అందరూ తమ తమ ప్రదేశాలలో సాధారణ పౌరులు మాదిరిగా పాల్గొనాలని బిజెపి పార్లమెంటరీ పార్టీ ఆదేశించింది. అదే విధంగా అన్ని చోట్ల బిజెపి నేతలు అందరూ పాల్గొంటూ, స్థానిక అధికారులకు సహకరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులను పార్టీ కోరింది.  ఈ మాక్‌ డ్రిల్స్‌లో అధికారులతో పాటు సివిల్‌ డిఫెన్స్‌ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌సీసీ/ ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ యువకేంద్రాలు, కళాశాలలు/ పాఠశాలల విద్యార్థులను భాగస్వాముల్ని చేయనున్నారు.
శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది. దేశంలో సెక్యూరిటీ మాక్‌డ్రిల్స్‌ నిర్వహణ కొత్తదేమీ కాదు. అదే సంవత్సరం 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసమని భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌ను నిర్వహించింది. ఇప్పుడు 54 ఏండ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తున్నది.
మాక్ డ్రిల్ నేపథ్యంలో తాత్కాళికంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా తాత్కాలికంగా మొబైల్ సిగ్నల్స్ నిలిపివేస్తామని తెలిపింది. ట్రాఫిక్ డైవర్షన్స్, కీలక ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మాక్ డ్రిల్లో భాగమేనని పేర్కొంది. పబ్లిక్ అనౌన్స్మెంట్, తాత్కాలికంగా రాత్రిపూట కరెంటు నిలిపివేయడం, యుద్ధం సంభవించే పరిస్థితుల్లో ఎలాంటి ఎమర్జెన్సీని పాటిస్తారో అలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించింది.