ఇజ్రాయిల్‌లోని ప్రధాన విమానాశ్రయం టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఆదివారం ఉదయం క్షిపణి దాడి జరిగింది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఈ క్షిపణి విమానాశ్రయం మూడవ టెర్మినల్‌కు కేవలం 75 మీటర్ల దూరంలో పడింది. విమానాశ్రయం యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న తోటలో ఈ క్షిపణి పడింది.
దీంతో అక్కడ 25 మీటర్ల లోతైన గొయ్యి ఏర్పడింది. ఈ దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. విమానాశ్రయంలో కార్యకలాపాలకు దాదాపు గంటసేపు ఆటకం కలిగింది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. నాలుగు అంచెల ఇజ్రాయిల్ వాయు రక్షణను దాటుకుని, దేశంలోని అత్యంత సున్నితమైన విమానాశ్రయం పరిసరాల్లో క్షిపణి పడటం ఇజ్రాయిల్ అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది.
క్షిపణిని అడ్డుకునేందుకు తాము చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, విమానాశ్రయంలో పడిన తరువాత దట్టమైన పొగలు అలముకున్నాయని ఇజ్రాయిల్ రక్షణ దళాలు (ఐడిఎఫ్) తెలిపాయి. క్షిపణి దాడి వల్ల టెర్మినల్ కు ఎలాంటి నష్టం జరగకున్నా. టెర్మినల్ లోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. గాజా స్ట్రిప్‌పై సైనిక కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేయాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ఇజ్రాయిల్ క్యాబినేట్ మంత్రులు ఆదివారం సాయంత్రం సమావేశం కానుండగా ఈ క్షిపణి దాడి జరగడం గమనార్హం.
ఈ దాడిపై హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయిల్ విమానాశ్రయంపై తమ బృందం హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని తెలిపారు. ఈ క్షిపణి దాడి తరువాత అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇజ్రాయిల్‌కు తమ సర్వీసులను రద్దు చేశాయి.
ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు ఆదివారం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని అబుదాబికి మళ్లించారు. టెల్ అవీవ్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం ఏఐ139 దిగడానికి అరగంట ముందు ఈ క్షిపణి దాడి ఘటన జరిగింది. ఈ నెల 6 వరకూ టెల్‌అవీవ్‌కు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

More Stories
శుద్ధి చేసిన యురేనియం ఇరాన్‌లోనే ఉండాలి
ఇరాన్ యుద్ధంలో 42 సైనిక విమానాలు కోల్పోయిన అమెరికా
ఉద్యోగంతో పాటు అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు ముప్పు!