పాక్ ప్రధాని షరీఫ్ యూట్యూబ్ ఛానల్‌ను భారత్ బ్లాక్

పాక్ ప్రధాని షరీఫ్ యూట్యూబ్ ఛానల్‌ను భారత్ బ్లాక్
 
* బంకర్లను సిద్ధం చేస్తున్న సరిహద్దు గ్రామాల ప్రజలు
పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను భారత్‌లో బ్లాక్ చేశారు. ఈ ఛానెల్‌ను సందర్శించే వీక్షకులకు ఇప్పుడు ఒక సందేశం కనిపిస్తున్నది. ‘జాతీయ భద్రత, ప్రజా వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం కారణంగా ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదు’ అని అందులో పేర్కొన్నారు.

పాకిస్థాన్‌కు చెందని ముగ్గురు ప్రముఖ క్రికెటర్ల ఇన్‌స్టా ఖాతాలను కూడా భారత్‌ బ్లాక్‌ లిస్టులో పెట్టింది. భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు బ్లాకైన పాకిస్థాన్‌ క్రికెటర్లలో బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ షా అఫ్రిది, మహ్మద్‌ రిజ్వాన్‌ ఉన్నారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పాకిస్థాన్‌ జావెలిన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ ఇన్‌స్టా ఖాతాను కూడా గురువారం ఉదయం భారత్‌ బ్లాక్‌ చేసింది.

కాగా, అంతకు ముందు పాకిస్థాన్‌కు చెందిన 16 ప్రముఖ యూట్యూబ్ ఛానెల్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. డాన్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, బోల్ న్యూస్ వంటి ప్రధాన వార్తా సంస్థల యూట్యూబ్ ఛానెల్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. సుమారు 63 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న ఈ ఛానెల్స్‌ భారతదేశం, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని అందులో ఆరోపించారు.

కాగా, సరిహద్దు అవతలి నుంచి కాల్పుల తీవ్రత పెరిగిన పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా తమ సామూహిక, వ్యక్తిగత బంకర్లను సరిహద్దు గ్రామాల ప్రజలు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2017లో 14,460 సామూహిక, వ్యక్తిగత బంకర్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. సంబా, కథువా, జమ్ము, పూంచ్‌, రాజౌరీ జిల్లాలో 8,600కిపైగా సామూహిక, వ్యక్తిగత బంకర్ల నిర్మాణం జరిగినట్లు అధికారులు తెలిపారు. 
 
ఐబీ వెంబడి ఉన్న ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా సెక్టార్లలో పంటల కోతలు పూర్తి కాగా కథువా, సంబా, రాజౌరీ, పూంచ్‌ జిల్లాలలో మాత్రం ఇంకా జరుగుతున్నాయి. ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని కోత పనులు పూర్తి చేయాలని సైన్యం రైతులను కోరినట్లు ఒక అధికారి తెలిపారు.   జమ్ము కశ్మీరులోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి పాకిస్థానీ దళాలు వరుసగా ఎనిమిదో రోజూ కవ్వింపు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారతీయ సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు గురువారం అధికారులు వెల్లడించారు.