
భారత్‌కు కీలకమైన సైనిక హార్డ్‌వేర్ సరఫరాతో పాటు లాజిస్టిక్ మద్దతును అందించేందుకు అమెరికా అంగీకరించింది. సుమారు రూ.11వేల కోట్లు (131 మిలియన్ డాలర్లు) విలువైన ప్రతిపాదనకు అగ్రరాజ్యం ఆమోదం తెలిపింది. అమెరికా రక్షణ శాఖ ‘పెంటగాన్’ పరిధిలోని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ) ఇందుకు అనుమతులు మంజూరు చేసింది.
దీనిపై అమెరికా కాంగ్రెస్‌కు కూడా సమాచారాన్ని అందజేసింది. ఇరుదేశాల మధ్యనున్న బలమైన ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్‌సీఏ వెల్లడించింది. అమెరికా నుంచి సైనిక కొనుగోళ్లను మరింత పెంచాలని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న వేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించడం గమనార్హం.
భారత్‌కు అందనున్న సైనిక హార్డ్‌వేర్‌ల జాబితాలో సీ విజన్ సాఫ్ట్‌వేర్, రిమోట్ సాఫ్ట్‌వేర్, అనలిటిక్ సపోర్ట్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరికరాల నిర్వహణ, నిల్వ, పంపిణీకి ఉపయోగపడే సామగ్రి సైతం అమెరికా నుంచి భారత్‌కు అందుతుందని సమాచారం.
‘‘ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక వికాసాల నిర్వహణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ మాకు ముఖ్యమైన రక్షణరంగ భాగస్వామి. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయి” అని డీఎస్‌సీఏతెలిపింది. “భారత్ భద్రతను బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించే అంశానికి అమెరికా కట్టుబడి ఉంది. భారత్‌కు ఈ సైనిక సామగ్రిని సమకూర్చడం అనేది అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రత లక్ష్యాలతో ముడిపడిన అంశం’’ అని డీఎస్‌సీఏ ఈసందర్భంగా వెల్లడించింది.
‘‘ఈ కీలక సైనిక సామగ్రిని విక్రయించడం వల్ల ప్రస్తుత, భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేలా భారత నౌకాదళం సామర్థ్యం విస్తరిస్తుంది. శత్రులక్ష్యాలను ముందస్తుగా గుర్తించి, విశ్లేషించుకొని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం చేకూరుతుంది. ఈ సామగ్రిని సైన్యంలో చేర్చుకునే విషయంలో భారత్‌కు ఎలాంటి అడ్డంకులూ లేవు. ఈ సామగ్రి వల్ల దక్షిణాసియా ప్రాంతంలో సైనిక సమతుల్యత దెబ్బతినదు. ఈ సైనిక సామగ్రిని వర్జీనియాలోని హెర్న్ డాన్ ప్రాంతంలో ఉన్న హాక్ ఐ 360 కంపెనీ భారత్‌కు సప్లై చేయనుంది. భారత్‌కు ఈ సేల్ జరపడం వల్ల అమెరికా రక్షణ సన్నద్ధతకు ముప్పేం ఉండదు’’ అని డీఎస్‌సీఏ పేర్కొంది.
ఇండో – పసిఫిక్ అవేర్‌నెస్ ప్రోగ్రాంకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా భారత్ – అమెరికా సహకారాన్ని అందించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ‘విదేశీ సైనిక విక్రయాలు’ కేటగిరీలో భారత్‌కు అమెరికా ఈవిధమైన మద్దతును అందిస్తోంది. డీఎస్‌సీఏ అనేది అమెరికా, దాని మిత్ర దేశాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తుంటుంది. అమెరికా జాతీయ భద్రత, విదేశీ విధానాల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ సంస్థ పెద్దపీట వేస్తుంది.
More Stories
యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థగా ప్రకటించిన ట్రంప్
రామ్‌గోపాల్ వర్మపై ఐపీఎస్ అంజనీ సిన్హా కేసు!
వారసత్వ రాజకీయాల్లో అగ్రగామి ఏపీ