
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. కుడ్లిగి రామకృష్ణారావు మే ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడతారు. ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.
ఈ ఏడాది ఆగస్టు వరకు 4 నెలల పాటు ఆయన సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. రామకృష్ణారావు 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలోనే ఆర్థిక ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల పాటు ఆర్థికశాఖలో కొనసాగుతూ వచ్చిన ఆయన 14 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లను తీర్చిదిద్దారు.
ఇందులో 12 పూరిస్థాయి, మరో రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లను తీర్చిదిద్దారు. తొలిసారిగా 2014 నవంబరు 5న పూర్తిస్థాయి బడ్టెట్‌ని ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు. 2013-14లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన ప్రక్రియలోనూ చురుగ్గా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతూ రాగా, తాజాగా ప్రభుత్వం ఆయనను సీఎస్‌గా నియమించింది.
రామకృష్ణారావు 1965 ఆగస్టు 30న ఉమ్మడి ఏపీలోని అనంతపురంలో జన్మించారు. ఆయన తండ్రి వరంగల్‌లో రైల్వే శాఖలో పనిచేశారు. అనంతపురం జిల్లాలోని కొడిగెన్‌హళ్లి గురుకుల పాఠశాలలో 1980లో పదో తరగతి పూర్తి చేసిన రామకృష్ణారావు కాన్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేశారు. ఢిల్లీ ఐఐటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో 2016 ఫిబ్రవరి 2న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక శాఖను కూడా ఆయన వద్దనే ఉంచుతూ సర్కారు మరో జీవో జారీ చేసింది.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత