ఇటు సూరత్‌.. అటు విక్రాంత్‌… సరిహద్దుల్లో మోహరింపు

ఇటు సూరత్‌.. అటు విక్రాంత్‌… సరిహద్దుల్లో మోహరింపు
పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఉగ్రఘటన నేపథ్యంలో దాడులు చేసుకొనే అవకాశం ఉండనే అనుమానంతో రెండు దేశాల సేనలు సరిహద్దు వైపు మోహరిస్తున్నాయి.  భారతీయ వైమానిక దళం(ఐఏఎప్‌) గురువారం సెంట్రల్‌ సెక్టార్‌ వ్యాప్తంగా ఆపరేషన్‌ ఆక్రమణ్‌ పేరిట భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించింది. 

రాఫెల్‌ జెట్ల సారథ్యంలో ఐఏఎఫ్‌ తన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్‌లోని హషిమారాలో రెండు రాఫెల్‌ స్కాడ్రన్లను ఐఏఎఫ్‌ నిర్వహిస్తోంది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రాఫెల్‌ యుద్ధ విమానాలు ప్రస్తుత వైమానిక విన్యాసాలలో కీలక భూమికను పోషిస్తున్నాయి.  చదునుగా ఉన్న ప్రదేశాలు, పర్వత ప్రాంతాలతో సహా భిన్న భూస్వరూపాలు కలిగిన ప్రదేశాలపై వైమానిక దాడులకు సంబంధించిన విన్యాసాలు ప్రస్తుతం జరుగుతున్నట్లు వారు చెప్పారు.

భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ ఐఏఎఫ్‌ ఆపరేషన్‌ ఆక్రమణ్‌ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  ఈ విన్యాసాలలో ‘టాప్‌ గన్స్‌’ పాల్గొంటున్నాయని, హై క్వాలిఫైడ్‌ ఇన్‌స్ట్రక్లర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న వీటిని ఐఏఎఫ్‌ ప్రధాన కార్యాలయం అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తోందని ఐఏఎఫ్‌ పైలట్లు వెల్లడించారు.

భారత నేవీ కూడా అప్రమత్తమైంది. తాజాగా గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎస్‌ఎస్‌ సూరత్‌ తొలిసారిగా గగనతలంలో వస్తున్న సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. 70 కిలోమీటర్ల రేంజ్‌లో లక్ష్యాన్ని కూల్చేసింది. ఈ మేరకు నౌకాదళం ఓ వీడియోను విడుదల చేసింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను, క్షిపణులను సీ స్కిమ్మింగ్‌ టార్గెట్లుగా పిలుస్తారు.

మరోవైపు, అరేబియా సముద్రంలో విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ తన గస్తీని మొదలుపెట్టింది. కర్ణాటకలోని కార్వార్‌ పోర్టు సమీపంలో విక్రాంత్‌ గస్తీని ముమ్మరం చేసినట్టు ఉపగ్రహ ఛాయా చిత్రాలను బట్టి తెలుస్తున్నది. పహల్గాం దాడి నేపథ్యంలోనే నేవీ యుద్ధ నౌకలను మోహరించినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌ దాడులు చేసే అవకాశం ఉన్నదన్న కారణంతో పాకిస్థాన్ క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలను నిర్వహించనున్నట్టు పాక్‌ మిలిటరీ నోటమ్‌ (నోటీస్‌ టూ ఎయిర్‌మన్‌) తెలిపింది. శుక్రవారంనాడు ఈ పరీక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది. 480 కిలోమీటర్ల మేర పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల క్షిపణులను పాక్‌ పరీక్షించే అవకాశం ఉన్నదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, భారత్‌ దాడి చేస్తే తిప్పికొట్టడానికి అప్రమత్తంగా ఉండాలంటూ సైన్యాధికారులకు ఆదేశాలనిచ్చిన పాక్‌ కీలక అధికారులకు సెలవులను రద్దు చేసినట్టు తెలిసింది. మరోవైపు, ఉగ్రదాడులు జరిగిన వెంటనే పాకిస్థాన్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు భారత సరిహద్దుల్లో చక్కర్లు కొట్టినట్టు సమాచారం.
వైట్‌ నైట్‌ క్రాప్స్‌కు చెందిన సైనికుడు ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీర మరణం పొందాడని సైన్యాధికారులు గురువారం వెల్లడించారు. ఉధంపూర్‌ జిల్లా డుడు-బసంత్‌ఘర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంలో తాము సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించామని నైట్‌ క్రాప్స్‌ ఎక్స్‌లో తెలిపింది. ‘ప్రారంభ ఘర్షణలో మా ధైర్యవంతుడైన సైనికుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దవాఖానలో ఉత్తమ వైద్యం అందించినా అతడు చనిపోయాడు. ప్రత్యేక దళం 6 పారాకు చెందిన హవల్దార్‌ జంటు అలీ షేక్‌గా అతడిని గుర్తించాం’ అని భారత సైన్యం పేర్కొంది. ఉగ్రవాదుల వేట కొనసాగుతున్నదని తెలిపింది.