భవిష్యత్‌లోనూ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోం

భవిష్యత్‌లోనూ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోం

పహల్గాంలో ఉగ్రదాడి ఘనత తర్వాత పాకిస్తాన్‌తో ఇకపై ఎలాంటి ద్వైపాక్షిక ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా స్పష్టం చేశారు. 2012-13 నుంచి భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో జరుగడం లేదు. చివరిసారిగా 2008లో బారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించింది. ప్రస్తుతం ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్‌ల సమయంలో మాత్రమే ఇరుజట్లు తలపడుతున్నాయి. 

 
పాకిస్తాన్ చివరిగా 2023 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా భారత్‌ను సందర్శించింది. అయితే, 2025 చాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్‌ నిరాకరించింది. ఈ తర్వాత భారత జట్టు మ్యాచులన్నీ దుబాయి వేదికగా జరిగాయి. ఓ స్పోర్ట్స్‌ సంస్థతో రాజీవ్‌ శుక్లా మాట్లాడుతూ హహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. తమ ప్రభుత్వం ఏది చెప్పినా చేస్తామని స్పష్టం చేశారు. 
 
ప్రభుత్వ వైఖరిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఆడడం లేదని, భవిష్యత్‌లోనూ పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక మ్యాచులు జరుగవని తేల్చి చెప్పారు. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఆడాల్సి వస్తుందని, అయితే, ఏం జరుగుతుందో ఐసీసీకి తెలుసునని, వారు సైతం సహకరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
 
ఉగ్రదాడి ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్‌ సైకియా సైతం విచారం వ్యక్తి చేశారు. భయంకరమైన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు మరణించడంపై అందరినీ బాధకు గురి చేసిందని చెప్పారు. దారుణమైన, పిరికిపంద చర్యను బీసీసీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్తిస్తున్నానని తెలిపారు. 
 
ఇదిలా ఉండగా,  హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్‌-ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉగ్రదాడి మృతులకు బీసీసీఐ నివాళులర్పించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు 60 సెకన్ల పాటు మౌనం పాటించారు. టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఈ దారుణమైన చర్యను తీవ్రంగా ఖండించారు. 
 
ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, కామెంటేటర్స్‌, సహాయక సిబ్బంది అందరూ నల్లటి బ్యాండ్‌లను ధరించారు. ఇక ఈ మ్యాచ్‌ను బీసీసీఐ ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే నిర్వహించింది. మ్యాచ్‌కు చీర్‌లీడర్స్‌ను దూరం పెట్టింది. అలాగే, ఫైర్‌క్రాకర్స్‌, మ్యూజిక్‌, డీజేలను సైతం ఏర్పాటు చేయలేదు.