పాక్‌ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు

పాక్‌ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు

పహల్గాం ఉగ్రదాడికి (ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్‌ దౌత్యపరమైన చర్యలు మరింత వేగం చేసింది. ఇప్పటికే దేశంలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించడంతోపాటు సిధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కేంద్రం‌ తాజాగా ఢిల్లీలోని పాక్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీచేసింది. 

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్‌ దౌత్యవేత్త సాద్‌ అహ్మద్‌ వరైచ్‌ను పిలిపించి పాక్‌ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్‌ గ్రాటా’ అధికారిక నోటీసులు అందించింది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు ఈ నోటీసులు జారీచేస్తారు. దీనిప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాల్సి ఉంటుంది. ఈమేరకు విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.

పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలు, ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాయగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆసిఫ్‌ ఫుజీ, సులేమాన్‌ షా, అబూతల్హాగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 

వీరంతా నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ సభ్యులని తెలుస్తున్నది. సైనిక దుస్తులు, కుర్తా పైజామాలు ధరించి వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. 

మంగళవారం మధ్యాహ్నం బైసరాన్‌ పచ్చిక బయలుకు చేరువలో ఉన్న దట్టమైన పైన్‌ అడవుల్లో నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్‌తో పర్యాటకులపై కాల్పులు జరిపి వచ్చిన మార్గంలోనే తప్పించుకు పారిపోయారు. దాడికి కొన్ని రోజుల ముందే ఈ గ్రూపుసహా పలువురు పాకిస్థానీ ఉగ్రవాదులు కశ్మీరులోకి చొరబడినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.