సివిల్‌ సర్వీసెస్‌ – 2024లో శక్తి దూబేకు ఫస్ట్‌ ర్యాంక్‌

సివిల్‌ సర్వీసెస్‌ – 2024లో శక్తి దూబేకు ఫస్ట్‌ ర్యాంక్‌
 దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ – 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దూబే అనే అభ్యర్థికి మొదటి ర్యాంకు వచ్చింది. ప్రయాగ్ రాజ్ కు చెందిన ఆమె బయో కెమిస్ట్రీలో అలహాబాద్ యూనివర్సిటీ నుండి బిఎస్సి,  బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఎంఎస్సి చేశారు. అయితే పొలిటికల్ సైన్స్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్స్ కు హాజరయ్యారు.
కాగా, బరోడాలోని ఎంఎస్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన హర్షిత గోయల్, పొలిటికల్ సైన్స్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని రెండవ ర్యాంక్ సాధించారు. వెల్లూరులోని విఐటి నుండి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బి.టెక్) డిగ్రీ పొందిన డోంగ్రే అర్చిత్ పరాగ్, తత్వశాస్త్రం ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని మూడవ ర్యాంక్ సాధించారు.
మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన 2,845 మందిని ఇంటర్వ్యూ చేసిన యూపీఎస్సీ ఇవాళ తుది ఫలితాలను ప్రకటించింది.  సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఎట్టబోయిన సాయి శివానికి 11వ ర్యాంకు వచ్చింది. ఇక బన్నా వెంకటేశ్‌ 15వ ర్యాంకు సాధించాడు. అభిషేక్‌ శర్మకు 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డికి 46వ ర్యాంకు, శ్రవణ్‌కుమార్‌ రెడ్డికి 62వ ర్యాంకు, సాయి చైతన్య జాదవ్‌కు 68వ ర్యాంకు, ఎన్‌ చేతనరెడ్డికి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేష్‌ రెడ్డికి 119వ ర్యాంకు వచ్చాయి. 

అయితే ఈసారి టాప్‌-10 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఒక్కరు కూడా లేరు. శక్తి దూబే అనే అభ్యర్థికి ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత హర్షిత గోయెల్‌, డోంగ్రే అర్చిత్‌ పరాగ్‌, షా మార్గి చిరాగ్‌, ఆకాశ్‌ గార్గ్‌, కోమల్‌ పూనియా వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంకులు సాధించారు. ఆయుషి బన్సల్‌, రాజ్‌కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్‌ అగర్వాల్‌, మయాంక్‌ త్రిపాఠిలు వరుసగా 6 నుంచి 10 ర్యాంకులు దక్కించుకున్నారు.

కాగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29వ వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌లో సత్తాచాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17 వరకు దశల వారీగా పర్సనల్‌ ఇంటర్వ్యూలు చేశారు.

మొత్తం 1,009 మందిని యూపీఎస్సీ  ఎంపిక చేసింది. అందులో జనరల్‌ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87 మంది చొప్పున ఎంపికయ్యారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు సుమారు 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమినరీ పరీక్ష 42,560 మంది రాశారు. వారిలో సుమారు 500 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారిలో నుంచి 100 మంది వరకు ఇంటర్వ్యూకు సెలెక్ట్‌ అయ్యారు.