
రాష్ట్రాలు తమకు కేటాయించిన ఆరోగ్య నిధులను పూర్తిగా వినియోగించుకోక పోవడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలని కోరారు. 17వ సివిల్ సర్వీసెస్ దినోత్సవంలో పాల్గొన్న జేపీ నడ్డా ‘వైద్య, ఆరోగ్య రంగానికి తగు నిధులు లేవని, ఉన్న నిధులను తగు విధంగా వాడే సామర్థ్యం లేదని వస్తున్న కథనాలను కొట్టిపారేసారు.
“ఇప్పటికే ఇచ్చిన నిధులను ఎలా ఉపయోగించారో తెలిపే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా రాష్ట్రాలు సమర్పించడం లేదు. పరికరాల సేకరణలో జాప్యం కారణంగా కేటాయించిన నిధులు మూడేళ్లుగా ఖర్చు కాకుండా అలానే ఉన్నాయి. నమూనాలు మారాయి. కొత్త వెర్షన్లు వచ్చాయి. కానీ టెండర్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు” అంటూ విచారం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతూ దానిని తాము మురికి కాలువలోకి వెళ్లనీయమని జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశంలో అన్ని పరిపాలనా స్థాయిల్లో జవాబుదారీతనం, సమన్వయం చాలా అవసరం అని ఆయన చెప్పారు. ప్రజలు వైద్య, ఆరోగ్య సంరక్షణ కోసం చేసే ఖర్చు 62 శాతం నుంచి 39 శాతానికి తగ్గినప్పుడు అది సాధారణ పౌరులకు ప్రయోజనం చేకూర్చే స్పష్టమైన సంకేతం అని ఆయన పేర్కొన్నారు.
వైద్య, ఆరోగ్య రంగంలో పరిపాలనా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని జేపీ నడ్డా తెలిపారు. “రాష్ట్ర హెల్త్ డైరెక్టర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లలో చాలా మందికి సరైన శిక్షణ లేదు. వారు అసమర్థులు, అందుకే వారు నిర్ణయాలు తీసుకోడానికి బాగా వెనుకాడుతుంటారు” అని చెప్పారు.
ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్లాన్ చేయడం, అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన చాలా మంది జిల్లా స్థాయి అధికారులకు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)కు చెందిన ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ (పీఐపీ) గురించి ఏమాత్రం తెలియదని నడ్డా పేర్కొన్నారు. కనుక ఐఏఎస్ అధికారులు పీఐపీ నిర్వహణ బాధ్యతలను తీసుకోవాలని, వాటిని ఢిల్లీకి ఫార్వర్డ్ చేసే ముందు జిల్లా అధికారులకు ఆ ప్రణాళికలో భాగం అయ్యేలా చూడాలని సూచించారు.
భారతదేశం నిర్వహిస్తున్న కరోనా టీకా ప్రచారం గురించి ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ బూస్టర్లతో సహా 220 కోట్లకు పైగా డోస్‌లను అందించగలిగామని, ఇది మన వైద్య, ఆరోగ్య వ్యవస్థ ఎంత బలంగా ఉందో రుజువు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇక ఆశా కార్యకర్తలకు ప్రోత్సాహాలు పెంచాలని, టెలిమెడిసిన్ సేవలను బలోపేతం చేయాలని ఆయన కోరారు.
మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 157 రకాల మందులను ఉచితంగా అందిస్తున్న ప్పటికీ, రోగులు తరచుగా మందుల కొరతను ఎదుర్కొంటున్నారని నడ్డా విమర్శించారు. పీఎం-జేఏవై బీమా పథకం, ఆయుష్మాన్ భారత్‌లను దీర్ఘకాలిక దార్శనికతతో ప్రవేశపెట్టినట్లు నడ్డా స్పష్టం చేశారు. ఇది భారతదేశ మొట్టమొదటి సమగ్రమైన ఆరోగ్య విధానం అని ఆయన పేర్కొన్నారు.
ఈ పీఎం-జేఏవై కింద ఇప్పటికే 61 కోట్ల మంది పౌరులకు హెల్త్ కవరేజ్ అందిస్తున్నామని ఆయన చెప్పారు. అంతేకాదు ప్రజారోగ్యం కింద చేసే వ్యయం 2014లో 29 శాతం ఉంటే, అది నేడు 48 శాతానికి పెరిగిందని నడ్డా పేర్కొన్నారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం