డిప్యూటీ కమాండర్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం వేటు

డిప్యూటీ కమాండర్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం వేటు
గాజాలో గత నెలలో ఓ వాహన శ్రేణిపై దాడి చేసిన ఘటనలో ఒక డిప్యూటీ కమాండర్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం వేటు వేసింది. మార్చి 23న రఫాలోని టెల్‌ అల్‌-సుల్తాన్‌ జిల్లాలో అంబులెన్సులపై, ఓ ఐరాస వాహనంపై ఇజ్రాయిల్‌ సేనలు దాడులు జరిపాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది పాలస్తీనా రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ సభ్యులు, ఆరుగురు పౌర సిబ్బంది, ఓ ఐరాస ఉద్యోగి మరణించారు. 

ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సైనిక దర్యాప్తునకు ఇజ్రాయిల్‌ ఆదేశించింది. ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తిపరమైన వైఫల్యాలు చోటుచేసుకున్నట్లు తేలింది. దీంతోనే డిప్యూటీ కమాండర్‌పై వేటు పడింది. ఘటన సమయంలో వాహనాలకు ఎటువంటి ఎమర్జెన్సీ సిగల్స్‌ లేవని ఇజ్రాయెల్‌ తొలుత పేర్కొంది. అయితే, వైద్య బృందంలో ఒకరి సెల్‌ఫోన్‌ నుంచి సేకరించిన వీడియో ఫుటేజీ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది.

దీంతో వెనక్కి తగ్గిన సైన్యం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. చీకట్లో సంబంధిత వాహనాలను హమాస్‌ మిలిటెంట్లకు చెందినవిగా ఐడీఎఫ్‌ డిప్యూటీ బెటాలియన్‌ కమాండర్‌ అంచనా వేసినట్లు తేలింది. అయితే, ఘటనా స్థలం నుంచి సేకరించిన వీడియోలో మాత్రం అంబులెన్సుల లైట్లు వెలుగుతున్నట్లు కనిపించాయి. తమ దళాలు పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం తెలిపింది. ఐరాస సిబ్బంది వాహనంపై దాడిని ఆదేశాల ఉల్లంఘనగా పేర్కొంది.

అంబులెన్సులను ధ్వంసం చేయాలనే నిర్ణయం తప్పేనని, అయితే, ఈ ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేయలేదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. హమాస్‌ తన ఫైటర్లను అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాల్లో తరలిస్తోందని, ఆస్పత్రులు, ఇతర పౌర సదుపాయాల్లో దాచిపెడుతోందని ఇజ్రాయెల్‌ పలు సందర్భాల్లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇటువంటి దాడులను సమర్థించుకుంటోంది. అయితే, వైద్య యంత్రాంగం ఈ ఆరోపణలను ఖండించింది.

కాగా, గాజాపై దాడులను కొనసాగిస్తామని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేశారు. ఇజ్రాయిల్‌ మనుగడ సాగించాలంటే పోరాడుతూనే ఉండాలని తెలిపారు. విజయం కోసం మన ఉనికి కోసం పోరాడుతూనే ఉండటం తప్ప, వేరే మార్గం లేదని పేర్కొంటూ హమాస్‌ను ఓడించడం, గాజాలో బందీలుగా ఉన్న 59 మందినికి రక్షించడం కోసం పోరాటం తప్పదని పేర్కొన్నారు.  కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్‌ తిరస్కరించడంతోనే గాజాపై బాంబు దాడులు కొనసాగిస్తున్నామని చెప్పారు. హమాస్‌ డిమాండ్లకు లంగిపోతే మన సైనికులు, మరణించిన, గాయపడిన హీరోలు సాధించిన అద్భుతమైన విజయాలన్నీ వృధా అవుతాయని తెలిపారు.