
వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ స్కామ్‌లో భాగంగా పక్కా నెట్‌వర్క్‌ను ఆయన తోడల్లుడు అవినాశ్‌రెడ్డి నడిపించారని తెలిపారు. లిక్కర్ పాలసీపై జరిగిన మొదటి రెండు సమావేశాల్లో మాత్రమే తాను పాల్గొన్నానని, అవి హైదరాబాద్, విజయవాడల్లో జరిగాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఈ క్రమంలో అరబిందో శరత్‌చంద్రారెడ్డి నుంచి రూ. 100 కోట్లు అప్పుగా ఇప్పించానని ఆయన చెప్పారు. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సిట్ అధికారుల ముందు హాజరయిన ఆయన, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగు అంశాలకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించారని తెలిపారు. ‘‘2019లో హైదరాబాద్, విజయవాడల్లో లిక్కర్‌కు సంబంధించిన సమావేశం జరిగిందా? అని ప్రశ్నించారు. ఆ రెండు చోట్ల జరిగిన భేటీల్లో నేను పాల్గొన్నట్టు తమకు సమాచారం ఉందని అధికారులు తెలిపారు” అని చెప్పారు.
“వాటిల్లో పాల్గొన్నట్టు నేను అంగీకరించాను. మొదటి భేటీలో నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఎస్పీవై బిజ్లరీస్) హాజరయ్యారని, వారే రెండో సమావేశంలోను పాల్గొన్నారని తెలిపాను. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి హాజరు కాలేదని చెప్పాను. ఈ సమావేశాల్లో లిక్కర్ పాలసీపై చర్చించినట్టు చెప్పాను” అని పేర్కొన్నారు.
“ముడుపుల విషయం తెలియదన్నాను. వ్యాపారం చేసుకుంటామని రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి రూ.100కోట్లు ఇప్పించానని చెప్పాను. రాజ్ కసిరెడ్డి చెప్పిన ఆడాన్ కంపెనీకి రూ.60 కోట్లు, డీకార్ట్ కంపెనీకి రూ.40 కోట్లు రికమండ్ చేసి ఇప్పించారా? ఎవరు చెబితే ఇప్పించారని అధికారులు ప్రశ్నించారు. నేనే రికమండ్ చేసి ఇప్పించానని చెప్పాను” అని వివరించారు.
“ఒడిశాలో అమ్మకందారు, చెన్నైలో కొనుగోలుదారు ఉండగా ఏపీ మీదుగా సరుకు వెళ్తున్నప్పుడు దానికి డ్యూటీ లేకుండా మళ్లించి అమ్మకాలు చేశారా? అని అడిగారు. వాటికి రాజ్ కసిరెడ్డి మాత్రమే సమాధానం చెప్పగలరని చెప్పాను. రాజ్ కసిరెడ్డి స్థానికంగా ఉన్న ఈబీ స్పిరిట్స్‌తోపాటు మరో రెండు కంపెనీలను లీజుకు తీసుకుని అందులో తయారు చేసిన కొత్త బ్రాండ్లను ఎలాంటి డ్యూటీ లేకుండా బెల్టు షాపుల ద్వారా అమ్మారా? అని అధికారులు ప్రశ్నించారు. ఇది రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వవలసిన అంశమని చెప్పా.. పిలిస్తే మరోసారి విచారణకు వస్తానని చెప్పాను.’’ అని విజయసాయి వివరించారు.
More Stories
`త్రిశూల’ వ్యూహంతో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి
విశాఖ సముద్ర తీర కోత నివారణకు కేంద్రం రూ 222 కోట్లు
ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత