జగన్ అక్రమాస్తుల కేసులో రూ.793 కోట్ల దాల్మియా ఆస్తులు జప్తు

జగన్ అక్రమాస్తుల కేసులో రూ.793 కోట్ల దాల్మియా ఆస్తులు జప్తు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ మరోసారి కొరడా ఝుళిపించింది. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793 కోట్ల విలువైన భూమిని జప్తు చేసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం మార్చి 31న తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజుల దాల్మియాకు అక్రమంగా కట్టబెట్టారని అభియోగం. దాల్మియా నుంచి జగన్ సుమారు రూ. 150 కోట్ల ముడుపులు తీసుకున్నారన్న సీబీఐ ఛార్జిషీట్‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు విచారణ చేస్తోంది.

జప్తు ఉత్తర్వులు ఈ నెల 15న రాత్రి దాల్మియా సిమెంట్స్‌కు అందాయి. కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి విలువ రూ.377 కోట్లుగా దాల్మియా సిమెంట్స్ పేర్కొంది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం, నవాబ్ పేటలో 407 హెక్టార్లలో సున్నపురాయి గనుల లీజుల కేటాయింపులోఅక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీ అభియోగం. 

జగన్ ప్రోద్భలంతో నిబంధనలకు విరుద్ధంగా దాల్మియా సిమెంట్స్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ప్రతిఫలంగా జగన్‌కు దాల్మియా నుంచి రూ.150 కోట్ల ముడుపులు అందినట్లు సీబీఐ ఆరోపణ. రఘురాం సిమెంట్స్‌లో షేర్ల రూపంలో రూ.95 కోట్లు హవాలా మార్గంలో మరో రూ.55 కోట్లు దాల్మియా ఇచ్చినట్లు సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. 

మరో రూ.85 కోట్లు హవాలా మార్గంలో చేర్చాలని భావించినప్పటికీ సీబీఐ కేసు నమోదు కావడంతో నిలిచిపోయినట్లు తెలపింది. జగన్, విజయసాయిరెడ్డి, పునీత్ దాల్మియా, సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ తదితరులపై 2013లో సీబీఐ ఛార్జిషీట్ వేసింది. దీని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది.

స్టే ఉత్తర్వులు ఉన్నందున చాలా కాలం ఈడీ కేసు విచారణ ముందుకు సాగలేదు. తాజాగా ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఇప్పటి వరకు 9 చార్జిషీట్లు దాఖలు చేసింది. భారతీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్‌ కేసుల్లో పలుమార్లు ఛార్జిషీట్లు వేసేందుకు ప్రయత్నించగా సాంకేతిక లోపాలు ఉండడంతో న్యాయస్థానం వెనక్కి పంపించింది. త్వరలో చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఈడీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.