
హెచ్‌సీయూ భూముల విషయంలో తప్పు చేసిందే బీఆర్ఎస్ వాళ్లని, ఇప్పుడు సుద్దపూసల్లా మాట్లాడుతున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందరావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మిగిలి ఉన్న భూములకైనా ప్రహరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. వర్సిటీ భూముల వ్యవహారంపై బీజేపీ ఎంపీలు బుధవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంట్లో సమావేశమై చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1974లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ అవసరాల కోసం 2324 ఎకరాల భూమిని కేటాయించిందని గుర్తు చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు లీజుకిచ్చిన అనంతరం మిగిలిన 2185 ఎకరాలను యూనివర్సిటీకి బదలాయించ లేదంటూ 2012లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు లేఖ రాశారని పేర్కొన్నారు. అప్పుడే భూమిని వర్సిటీకి అలినేషన్ చేసి ఉంటే ప్రస్తుత వివాదమే ఉండేది కాదని చెప్పారు.
ఈ భూముల నుంచే 400 ఎకరాలు ఐంఎంజీ సంస్థకు కేటాయించారని, ఆ తర్వాత ఒప్పందం రద్దు చేయడంతో ఆ సంస్థ కోర్టుకు వెళ్లిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఇందిరమ్మ పాలనలో మిగిలి ఉన్న భూములకు ప్రహరీ కట్టి, వర్సిటీకి అప్పగించాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు. 2012లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక సీసీఎల్ఏలో పెండింగ్‌లో ఉందని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పటి బీఆర్ఎస్ పాలకులు ఆ నివేదిక ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. నాటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా 2185 ఎకరాలను హెచ్సీయూకు అలినేషన్ చేయాలని లేఖ రాసినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఐఎంజీ భూములు 400 ఎకరాలు మినహాయించి, మిగిలిన 1785 ఎకరాలకైనా ఎందుకు ప్రహరీ నిర్మించలేదని, కేటీఆర్ ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.
వర్సిటీ భూములను టీఎన్జీవోలకు ఇచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వర్సిటీలో రోడ్డు వేసింది ఎవరని నిలదీశారు. ఈ నెల 16 వరకు సుప్రీం కోర్టు స్టేట్‌సకో ఇస్తే, ఇంతలోనే ఆ భూములు తమవేనంటూ టీజీఐఐసీ బోర్డు పెట్టడం కోర్టు ధిక్కరణ కాదా? అని నిలదీశారు.
అందరి చరిత్ర తీసుకుని గన్‌పార్క్‌కు వస్తే చర్చించేందుకు బీజేపీ సిద్ధమేనని రఘునందన్‌రావు చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ భూముల విషయంలో చట్ట ప్రకారం ఏం చేయాలనే అంశంపై చర్చించామని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ల బాధంతా ఆ భూములను తాము అమ్ముకోలేకపోయామనే తప్ప, వేరే ఏమీ లేదని పేర్కొన్నారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు