
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓ “ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్” నరసరావుపేట ఎంపీ, టీడీపీ లోక్‌సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా, వివిధ వర్గాల్లో అసహనం, విభేదాలు తలెత్తేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
దుష్ప్రచారాలతో ప్రజల్లో విద్వేషాలు రేకెత్తిస్తున్నారంటూ శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి జగన్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉండగా కూడా భద్రతా లోపాలపై డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హెలికాప్టర్ ఘటనను ప్రస్తావిస్తూ, “వాస్తవంగా హెలికాప్టర్‌కు ఏమీ కాలేదంటే, 12.56కి దెబ్బతిందని చెబితే అదే హెలికాప్టర్ 1 గంటకే ఎలా టేకాఫ్ అయింది?” అని ప్రశ్నించారు. అంతే కాక, ముందుగా బెంగళూరు వెళతానని పార్టీ శ్రేణులకు చెప్పి, తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ భద్రతా వైఫల్యం అంటూ ఆరోపణలు చేయడం కుట్రకు సంకేతమని ఆరోపించారు.
అంతేకాదు, గత కొంతకాలంగా జగన్ పోలీసు అధికారులను బెదిరించడం, ధ్వంసాత్మక వ్యాఖ్యలు చేయడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతింటోందని, పోలీసులపై బహిరంగంగా హెచ్చరికలు, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నారని లావు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే పోలీసులను తొలగిస్తామన్న వ్యాఖ్యలు తీవ్రతరం గా పరిగణించాల్సినవని స్పష్టం చేశారు.
వైసీపీ అధికారిక మీడియా వేదికలపై కూడా తప్పుదారి పట్టించేలా సమాచారం ఇచ్చి ప్రజల్లో భయభ్రాంతులు, ప్రభుత్వంపై అభద్రతాభావం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆక్షేపించారు. ఈ వ్యవహారమంతా కుట్రపూరితంగానే సాగుతోందని, జగన్ చేసిన డ్రామాలు, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసే కుట్రల మచ్చుతునకగా భావించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
పోలీసులపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని, అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను రాజకీయ ప్రత్యర్థులపై వాడుకుని, ఇప్పుడు అదే అధికారులపై బురదజల్లుతున్నారని విమర్శించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఆయనపై ఇప్పటికే సీబీఐ 11 చార్జిషీట్లు, ఈడీ 9 మనీలాండరింగ్ కేసులు నమోదు చేశాయని లావు గుర్తు చేశారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదన చేసిన జగన్, నేటి వరకు బెయిల్‌పైనే తిరుగుతున్నాని, ప్రజలను మోసం చేయడం, డ్రామాలు ఆడడం ఆయనకు అలవాటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల ముందు జరిగిన తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్, అప్పటి ప్రభుత్వాన్ని తప్పుపట్టారని, ఇప్పుడు అదే హత్యపై సీబీఐ దర్యాప్తును కూడా అవమానిస్తున్నారని శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు