
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదిరింది. అమెరికా ఇటీవల ప్రతీకార సుంకాలను ప్రకటించడంతో చైనా ఘాటుగానే బదులిచ్చింది. డ్రాగన్ దేశం సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది. అయితే, సుంకాలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మరింత సుంకాలను ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
చైనా వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ అన్నంత పని చేశారు. చైనా వస్తువులపై భారీగా సుంకాలను ప్రకటించారు. తాజా సుంకాలతో 104 శాతానికి సుంకాలు చేరాయి. కొత్తగా ప్రకటించిన సుంకాలు రాత్రి (అమెరికా స్థానిక కాలమానం) 12.01గంటల నుంచి అమలులోకి వస్తాయని వైట్‌హౌస్ వెల్లడించింది.
ఏప్రిల్ 2న అమెరికా చైనాపై 34శాతం సుంకాలను విధించింది.
దీనికి స్పందనగా డ్రాగన్ దేశం సైతం అగ్రరాజ్యంపై 34శాతం సుంకాలు విధించింది. చైనా కొత్తగా ప్రకటించిన 34శాతం సుంకాలను ఉపసంహరించుకోకపోతే 50 శాతం అదనంగా సుంకాలను ప్రకటిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఏప్రిల్ 9 నుంచి అమలులోకి వస్తాయని.. దాంతో పాటు చైనాతో అన్ని చర్చలు సైతం రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
దీనికి అమెరికా ప్రతీకార సుంకాలు ఏకపక్షమని, రెచ్చగొట్టడమేనంటూ చైనా స్పందించింది. తాము సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించామని, భవిష్యత్‌లోనూ మరిన్ని సుంకాలు పెంచుతామని ఘాటుగా బదులిచ్చింది. సార్వభౌమాధికారం, భద్రతా, అభివృద్ధి తదితర ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా వాణిజ్యమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు