దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు

దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు

దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఐదుగురు నిందితులకు 2016లో ఎన్​ఐఏ కోర్టు ఉరిశిక్షను విధించగా, ఎన్​ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని వారంతా హైకోర్టుకు అప్పీల్​కు వెళ్లారు. ఆ ఐదుగురు నిందితులు చేసిన అప్పీళ్లను హైకోర్టు తిరస్కరించింది. ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.

2013 ఫిబ్రవరి 21వ తేదీన మొదటి పేలుడు రాత్రి 7 గంటల సమయంలో మలక్​పేట పోలీస్​ స్టేషన్​ పరిధిలోకి వచ్చే దిల్​సుఖ్​నగర్​లోని 107 నంబరు గల బస్​స్టాప్​ వద్ద జరిగింది. మరికొద్ది క్షణాల వ్యవధిలో కోణార్క్​ థియేటర్​ సమీపంలోని ఏ-1 మిర్చి సెంటర్​ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల దాటికి మొత్తం 18 మంది మృత్యువాతపడగా, 131 మంది గాయపడ్డారు.

గాయపడిన వారిలో మహిళ, ఆమె గర్భంలో ఉన్న శిశువుకు కూడా గాయాలయ్యాయి. ఈ పేలుడుపై సరూర్​నగర్​ పోలీసులు కేసు నమోదు చేసి, అప్పట్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించగా, కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. 
 
హైదరాబాద్​లో నమోదైన ఈ రెండు కేసులు ఎన్‌ఐఏకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. దర్యాప్తులో భాగంగా అహ్మద్‌ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్‌, అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్దిలను 2013లోనే ఇండో-నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్ట్ చేశారు. 

విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు. వీరిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు బిహార్​కు చెందిన తహసీన్ అక్తర్, పాకిస్థాన్​కు చెందిన జియా ఉర్‌ రెహమాన్​లను 2014 మేలో రాజస్థాన్​లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పుణేకు చెందిన అజిజ్‌ షేక్​ను సైతం ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది.

నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియా రియాజ్ బక్తల్​గా గుర్తించారు. కర్ణాటక బక్తల్​కు చెందిన రియాజ్ బక్తల్ ఇప్పటికీ పాకిస్థాన్​లో తలదాచుకున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేశారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ ఆరుగురు నిందితులపై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో 3 చార్జిషీట్లు దాఖలు చేసింది.

ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది. విచాణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించింది. 
 
2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. కాగా ఎన్‌ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్​పై విచారణ జరుగుతోంది. నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇవాళ దీనిపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చి, వారు దాఖలు చేసిన అప్పీల్​ను డిస్మిస్​ చేసింది.