హెచ్ 1బీ వీసాదారులు అమెరికాను వీడొద్దు 

హెచ్ 1బీ వీసాదారులు అమెరికాను వీడొద్దు 
* వీసాదారులకు టెక్‌ కంపెనీలు హెచ్చరిక
 

అమెరికా వీసాలు, ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకూ ఆ దేశంలో ఉన్న వలసదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీసా నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేసిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని అమెరికాలోని వలసదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

 
ఈ నేపథ్యంలోనే హెచ్ 1బీ వీసాదారులకు టెక్ దిగ్గజాలు కీలక సూచనలు చేస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్‌ పాలసీ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న గందరగోళం వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది.  స్వదేశానికి వెళ్తే తిరిగి అమెరికాకు రానిస్తారా? లేదా? అన్నదానిపై హెచ్‌1బీ వీసాదారులలో అనుమానాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి ప్రఖ్యాత టెక్‌ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్‌1బీ వీసాదారులను అప్రమత్తం చేస్తూ దేశాన్ని వీడొద్దని సూచించాయి.  మళ్లీ అమెరికాకు తిరిగిరావడానికి అనుమతి ఉంటుందో? లేదోననే అనుమానాలు ఉన్నందున.. ఈ హెచ్చరికలు జారీచేస్తున్నట్టు సదరు కంపెనీలు పేర్కొన్నాయి.
అమెరికాను వీడొద్దంటూ ఆయా ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇప్పటికే సూచించాయి. దీంతో భారత్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు పలువురు హెచ్‌1 బీ వీసాదార్లు చెప్పినట్టు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం పేర్కొన్నది.  ప్రస్తుతం నెలకొన్న భయాల నేపథ్యంలో భారత పర్యటనను కొన్నిరోజులు వాయిదా వేసుకున్నట్లు అమెరికాలో నివసిస్తున్న ఇద్దరు భారతీయులు ఇటీవల మీడియాకు చెప్పడం అక్కడి పరిస్థితి ఎలా ఉందో చెబుతోంది.
 
హెచ్‌-1బీ, ఎఫ్‌-1, గ్రీన్‌కార్డు కలిగిన భారతీయులు తమ ప్రయాణాల్లో అలర్ట్‌గా ఉండాలని.. ఇటీవల అమెరికా వలస విభాగం అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. అమెరికాకు వచ్చేటపుడు, బయటికి వెళ్లేటపుడు తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని అందుకు ఓపిగ్గా ఉండాలని సూచించారు. విదేశాల్లో ఎక్కువ కాలం ఉండి అమెరికాకు తిరిగి వచ్చే వలసదారులు కస్టమ్స్, బోర్డర్‌ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 
 
వలసదారులంతా తమ స్వదేశీ పాస్‌పోర్టుతో పాటు సంబంధిత పత్రాలన్నీ ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని తెలిపారు. గ్రీన్‌కార్డు, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్‌మెంట్‌ వెరిఫికేషన్‌ లెటర్, ఫెడరల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపులు, పే స్లిప్‌లు సరిగ్గా ఉన్నయో లేవో చూసుకోవాలని హితవు పలికారు. ఇక స్టూడెంట్స్ అయితే కాలేజీ, యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతోపాటు, యూఎస్‌ బ్యాంకు అకౌంట్ వివరాలు చూపించాలని పేర్కొన్నారు.