కునాల్‌ కామ్రాకు ఉగ్ర నిధులు

కునాల్‌ కామ్రాకు ఉగ్ర నిధులు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్ర వ్యాఖ్యల వివాదం ముదురుతోంది. కునాల్ కామ్రకు ‘ఉగ్రవాద నిధులు’  అందుతున్నాయని శివసేన నేత రాహుల్ కనాల్  సంచలన ఆరోపణలు చేశారు. దేశ సమగ్రతను బలహీనపరిచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక సంస్థల నుంచి కునాల్ నిధులు పొందుతున్నారని ఆయన ఆరోపించారు. 

ముంబై హాబిటాట్ స్టూడియోపై ఇటీవల దాడికి పాల్పడిన శివసేన పార్టీ కార్యకర్తలకు రాహుల్ నాయకత్వం వహించారు.  కునాల్ కామ్ర ”నయాభారత్” కామిడీ షోలో ఏక్‌నాథ్ షిండేను ”ద్రోహి”గా అభివర్ణించడం సంచలనమైంది. కామ్ర క్షమాపణ చెప్పాలని శివసేన, బీజేపీ డిమాండ్ చేయగా, ఆయనపై పలు ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కామ్రపై రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సంచలన ఆరోపణలు చేశారు.

కెనడా, ఖలిస్థాన్ మద్దతుదారులతో సహా పలువురి నుంచి కామ్రాకు నిధులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ”భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం చాలామంది జీర్ణించుకోలేకున్నారు. కునాల్ వంటి కీలబొమ్మలకు ఈ సంస్థలు నిధులు అందజేస్తూ దేశ సమగ్రత, శాంతిభద్రతలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆ పోస్ట్‌లో రాహుల్ పేర్కొన్నారు.

తన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయని రాహుల్ తెలిపారు. వాటిని ఖార్ పోలీస్ స్టేషన్‌కు అందజేస్తానని చెప్పారు. ప్రధాని మోదీని, మరికొందరిని విమర్శిస్తూ పలు వీడియోలు పోస్ట్ అయిన తర్వాత భారత వ్యతిరేక ఉగ్రసంస్థలు కునాల్‌కు డబ్బులు ఇస్తున్నాయని, వాటి ద్వారా వచ్చిన నగదుకు సంబంధించి తన వద్ద 300 స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయని తెలిపారు. కామ్రా ఛానెల్‌ను మూసివేసి, మానిటైజేషన్ నిలిపివేయాలని కోరేందుకు యూట్యూబ్ కార్యాలయానికి వెళ్తానని చెప్పారు.