అంతర్గత విచారణ తర్వాతే జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్

అంతర్గత విచారణ తర్వాతే జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్
అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శక్రవారంనాడు తోసిపుచ్చింది. మందు అంతర్గత విచారణ పూర్తి కావాలని న్యాయమూర్తులు అభయ్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

అంతర్గత విచారణలో ఆయన (జస్టిస్ వర్మ) దోషిగా తేలితే ఎఫ్ఐఆర్ నమోదుకు కానీ, పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం కానీ జరుగుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం ఇన్-హౌస్ ఎంక్వయిరీ జరుగుతున్నందున నివేదిక అనంతరమే ఏమి చేయాలనే దానిపై చాలా అప్షన్లు ఉంటాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్‍ను కొట్టివేసింది.

జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని మార్చి 22న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియమించారు. త్రిసభ్య కమిటీ జస్టిస్ వర్మను ఈ వారంలో కలిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో లుథేన్స్ ఢిల్లీ నివాసానికి వచ్చిన న్యాయమూర్తులు సిద్ధార్థ్ అగర్వాల్, మనేక గురుస్వామి, అరుంధటి కట్జు, తారా నరూలాను న్యాయసలహాల కోసం జస్టిస్ వర్మ సంప్రదించినట్టు తెలుస్తోంది. 

తుగ్లక్ క్రిసెంట్‌లోని జస్టిస్ వర్మ నివాసాన్ని ఇటీవల త్రిసభ్య కమిటీ సందర్శించింది. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిప్పిపంపాలని సుప్రీంకోర్టు కొలిజియం ఇటీవల సిఫారసు చేసింది. అయితే, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని అలబాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది.  న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచేదుకు జస్టిస్ వర్మపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అభిశంసనకు సిఫారసు చేయాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. వర్మ పాత కేసుల్లో తీర్పులను కూడా పునఃసమీక్షించాలని కోరింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా గురువారం వివిధ బార్‌ అసోసియేషన్ల నాయకులతో సమావేశమయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు. వారి డిమాండ్లను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.  జస్టిస్‌ వర్మ బదిలీకి సంబంధించి తమ డిమాండ్‌ను పరిశీలిస్తానని ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారని అలహాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అనిల్‌ తివారీ తెలిపారు. నిరవధిక సమ్మెను కొనసాగించాలా లేక విరమించాలా అనే విషయాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పారు.