సామ్‌సంగ్‌ రూ. 5,150 కోట్ల పన్ను ఎగవేత!

సామ్‌సంగ్‌  రూ. 5,150 కోట్ల పన్ను ఎగవేత!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌కు భారత ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఆ కంపెనీతో పాటు ఎగ్జిక్యూటివ్‌లకు 601 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.5,150 కోట్లు) పన్ను డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. కీలకమైన టెలికాం పరికరాల దిగుమతులపై సుంకాలను ఎగవేసిన ఆరోపణలపై పన్నులు, జరిమానా కలిపి చెల్లించాలని ఐటి శాఖ నోటీసుల్లో స్పష్టం చేసింది.

గతేడాది కంపెనీ సాధించిన రూ.8,180 కోట్ల నికర లాభాల్లో ఇది సగానికి పైగా ఉండటం విశేషం. కంపెనీ టెలికాం పరికరాలను దిగుమతి చేసుకునే క్రమంలో 2023 ఏడాది మొబైల్‌ టవర్‌లలో ఉపయోగించే కీలకమైన ట్రాన్స్‌మిషన్‌ పరికరాలపై 10- 20 శాతం సుంకాలను చెల్లించలేదని ఐటి అధికారులు గుర్తించారు. 

ఈ పరికరాలను ముకేష్‌ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో కోసం దిగుమతి చేసి విక్రయించింది. సామ్‌సంగ్‌ భారతీయ చట్టాలను ఉల్లంఘించిందని, ఉద్దేశపూర్వకంగా క్లియరెన్స్‌ కోసం కస్టమ్స్‌ అథారిటీకి తప్పుడు పత్రాలను సమర్పించిందని అని కస్టమ్స్‌ కమిషనర్‌ సోనాల్‌ బజాజ్‌ నోటీసుల్లో తెలిపారు.

లాభాలను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఉల్లంఘనలపై పన్ను బకాయిలు, 100 శాతం పెనాల్టీతో కలిపి సామ్‌సంగ్‌ 520 మిలియన్లు చెల్లించాలని కస్టమ్స్‌ విభాగం ఆదేశాలు జారీ చేసింది.  అదే విధంగా ఏడుగురు సామ్‌సంగ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌లకు 81 మిలియన్‌ డాలర్ల జరిమానా కూడా విధించింది.

దీంతో సామ్‌సంగ్‌ మొత్తంగా 601 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఇటీవలి కాలంలో అతిపెద్ద పన్ను డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం.  ఈవిషయంపై 2023 లోనే సామ్‌సంగ్‌ను భారత్‌ హెచ్చరించింది. 2021 నుంచే విచారణ జరుపుతోంది. కాగా.. తాము బాధ్యతాయుతంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని సామ్‌సంగ్‌ పేర్కొంది. దేశంలోని చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని.. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామని పేర్కొంది.