అలిపిరిలో స్టార్‌ హోటల్‌ వ్యతిరేకిస్తూ సాధువుల నిరసన

అలిపిరిలో స్టార్‌ హోటల్‌ వ్యతిరేకిస్తూ సాధువుల నిరసన

తిరుపతి నగరం అలిపిరి సమీపంలో ఒబెరాయ్‌ గ్రూప్‌కు చెందిన 7స్టార్‌ హోటల్‌ నిర్మాణాన్ని వ్యతిరేకంగా సాధువులు అందోళనకు దిగారు. హోటల్‌కు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దుచేయాలని, నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండు చేశారు. అలిపిరిలో దీక్ష ప్రారంభించిన వీరు పాదయాత్రగా తిరుమలకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. 

ఎక్కువ సంఖ్యలో కాలినడకన వెళ్లడం వల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పోలీసులు వారికి నచ్చజెప్పారు. ఇంతలో వీరికి మద్దతుగా బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్‌ తన అనుచరగణంతో అలిపిరి చేరుకున్నారు. వారితో కలసి నినాదాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని విజ్ఞప్తి చేశారు. 

నెయ్యి కల్తీపై ఎవరికి తోచింది వారు చెబుతున్నారని, కల్తీ జరిగిందా? లేదా? అనేదానిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. టీటీడీ ఆధ్వర్యంలో గోశాలలు ఏర్పాటుచేసి, వాటినుంచి వచ్చే పాలు, నెయ్యిని మాత్రమే శ్రీవారికి వినియోగించాలని తాను కోరానని చెప్పారు. గోవులతోపాటు 25 ఎకరాల మామిడితోటను గోశాలకు ఉచితంగా ఇస్తానని చెప్పినా వినిపించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. 

అలిపిరి వద్ద భూములు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టి, ధార్మిక విరుద్ధమైన కార్యక్రమాలు మొదలుపెట్టారని మండిపడుతూ వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తిరుమల పవిత్రత కోసం సాధువులతో కలిసి పాదయాత్రగా కొండకు వెళుతున్నట్టు చెప్పారు. ఇంతలో తిరుమల పోలీసులు శ్రీనివాస సరస్వతితో పాటు రామచంద్రయ్య యాదవ్‌కు నోటీసులు అందజేశారు. 

తిరుమల కొండపై ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయకూడదని, నిరసనలకు పాల్పడరాదని, ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించకూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గోవుకు పూజ చేసి నడకమార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు.

‘కొండ’పైకి చేరిన వీరు పోలీసుల నోటీసులను విస్మరించారు. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా, శ్రీవారి ఆలయం ముందు అఖిలాండం వద్దకు నిరసనకు కూర్చున్నారు. నినాదాలు చేశారు. పోలీసులు నచ్చచెప్పినా వినిపించుకోలేదు. చివరకు వీరందరినీ లాగి వాహనాల్లో తిరుపతికి, వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.

వీరిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టంచేశారు. కాగా, తిరుమలలో ప్రక్షాళన జరిగే వరకు పోరాటం సాగిస్తామని రామచంద్ర యాదవ్‌ చెప్పారు. తిరుమలలో ఈయన్ను అదుపులోని తీసుకున్న పోలీసులు భాకరాపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.