
స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి. దాంతో, మంగళవారం వాటిని శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అనంతరం వాటిని ప్రభుత్వం గవర్నర్‌కు పంపనుంది. ఆయన వాటిని పరిశీలించి రాష్ట్రపతికి పంపనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 29 శాతం. వాటిని 42 శాతానికి పెంచుతూ ఆమోదించిన బిల్లు చట్ట రూపం దాల్చాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీతో వాటికి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకు కారణం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతాన్ని మించకూడదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
ఒకవేళ జర్వేషన్లను పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుంది. అందుకే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 (సి) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్టు బిల్లుల్లో పేర్కొంది. అంతకుముందు శాసనసభలో బిసి ల రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ కెసిఆర్‌కు, బిజెపి నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా, జెండా, అజెండాలు పక్కన పెట్టి బిసి బిల్లుకు సహకరించాలని కోరారు.
మనందరం వీలైనంత త్వరగా ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా బిసి రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందామని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున చట్ట సవరణ కోసం ప్రధాని మోదీని, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని అందరం కలిసి కట్టుగా కలుద్దామని ఆయన సూచించారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదేనని ఆయన స్పష్టం చేశారు. ఇక, రాహుల్ గాంధీని కలిసే విషయం మా పిసిసి అధ్యక్షుడు తీసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
విద్య, ఉపాధి, ఉద్యోగరంగాలతోపాటు స్థానికసంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టం చేయడానికే పరిమిత కాకుండా, అది చెల్లుబాటయ్యేలా కూడా చూడాలని ప్రభుత్వానికి బిఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సభ్యులు సూచించారు. ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును, సాంకేతిక కారణాలను చూపవద్దని, రాష్ట్ర పరిధిలోని పోస్టుల్లోనైనా రిజర్వేషన్లను అమలు చేయాలని బిజెపి ఎమ్యెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
న్యాయబద్ధంగా, శాస్త్రీయ గణాంకాలతో సుప్రీంకోర్టును ఒప్పిస్తే చట్టం అమలు సాధ్యమేనని, అందుకు ఎస్సీ వర్గీకరణ తీర్పు నిదర్శమని ఉదహరించారు. చట్టం చేసి కేంద్రానికి పంపించి, ఆ తరువాత ఇతరులపై ఆరోపణలు చేయవచ్చనే ఆలోచనలు చేయవద్దని హితవు పలికారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు