మణిపూర్‌ హింసాకాండ కేసులన్నీ గౌహతికి బదిలీ

మణిపూర్‌ హింసాకాండ కేసులన్నీ గౌహతికి బదిలీ

మణిపూర్‌ హింసాకాండ కేసులను గౌహతికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ప్రస్తుతం సీబీఐ విచారణ చేపడుతున్న ఈ కేసులను గతంలో అస్సాంకి బదిలీ చేసింది. బదిలీ చేయబడిన కేసుల విచారణ గౌహతి కోర్టులోనే జరుగుతుందని తాము స్పష్టం చేస్తున్నట్లు అని సిజెఐ సంజీవ్‌ ఖన్నా తెలిపారు. 

2023, ఆగస్ట్‌ 25న ముందస్తు విచారణ కోసం గౌహతికి బదిలీ చేసిన కేసులలో విచారణపై న్యాయవాది చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. సిజెఐ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కూడా జస్టిస్‌ గీతామిట్టల్‌ నేతృత్వంలోని కమిటీ పదవీకాలాన్ని 2025, జులై 31 వరకు పొడిగించింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది.

మణిపూర్‌ జాతి హింస ఘటనల్లో బాధితుల ఆశ్రయం, ఉపశమనం కోసం బాంబే హైకోర్టు జడ్జి ఎస్‌.పి.జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి ఆశా మీనన్‌, జమ్ముకాశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్‌ అధ్యక్షతన సుప్రీంకోర్టు 2023 ఆగస్టు 7న ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 5న కమిటీ పదవి కాలాన్ని సుప్రీంకోర్టు ఆరు నెలలు పొడిగించింది.

మణిపూర్‌లో వాతావరణం, నేర విచారణ న్యాయమైన ప్రక్రియను నిర్ధారించాల్సిన అవసరాల రిత్యా సుప్రీంకోర్టు గతంలో 27 కేసులను అస్సాంకి బదిలీ చేసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా  ఊరేగించిన కేసుతో పాటు లైంగిక వేధింపుల కేసులు, ఆయుధాల లూటీ కేసులు వీటిలో ఉన్నాయి. బదిలీ అయిన కేసులను పరిష్కరించడానికి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయాధికారులను నామినేట్‌ చేయాలని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించింది.