
ఓడినా అడుగులు ముందుకు వేశామని, అధికారం కోసం కాకుండా మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆయన మాట్లాడుతూ అన్నీ ఒక్కడినే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించానని, 2018 పోరాట యాత్ర చేశానని గుర్తు చేశారు.
ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశామని, ఓడినా అడుగు ముందుకే వేశామని, మనం నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టిడిపి పార్టీని కూడా నిలబెట్టామని పేర్కొన్నారు. 2019లో ఓడినప్పుడు ఎన్నో అవమానాలను చూశామని చెబుతూ వీర మహిళలను సైతం హింసించారని, ఇదేం న్యాయమని అడిగితే కేసులు పెట్టారని వివరించారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారని విమర్శించారు.
అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసిన వారి తొడలను బద్దలుగొట్టామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశమంతా చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించి ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని నిలబెట్టామని తెలిపారు. వంద శాతం స్ట్రెక్ రేట్‌కు జనసేన సిద్ధాంతాలే కారణమని స్పష్టం చేశారు. హర్యానాలో ఎన్‌డిఎ కోసం ప్రచారం చేశానని, 95 శాతం సీట్లు గెలిచామని తెలిపారు.
దేశంలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జనసైనికులకు అభిమానులకు వారివారి ప్రాంతీయ భాషలో నమస్కారాలు తెలిపారు. బహుభాషా విధానమే దేశానికి మంచిదని స్పష్టం చేశారు. తాను సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఎదగలేదని, సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగానని తెలిపారు.
2006లో బహుజన సిద్ధాంతాల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం ఆలోచించే ప్రస్తుత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతిరాముడు రాజకీయాల్లోకి రావాలని కోరారని, తనకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదని ఆనాడు తెలిపానని పేర్కొన్నారు. 450 మంది జనసైనికులు సినిమాలను కాకుండా పార్టీ సిద్ధాంతాలను నమ్మి వివిధ కారణాలతో చనిపోయారని, వారందరి కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకున్నామని తెలిపారు.
గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకాలన్నదే తన కోరికని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తాననిగానీ, సినిమాల్లోకి వస్తానని తానూ కూడా ఊహించలేదని, ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది తనలో భావ తీవ్రత అని తెలిపారు. చేగువేరాలో మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డానని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలగడం తన ఆదర్శమని తెలిపారు.
చిన్నతనం నుంచి ఈ క్షణం వరకు ప్రతి అంశాన్ని నేర్చుకుంటూనే ఉన్నానని చెబుతూ మనం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, వారిని 11 సీట్లకు పరిమితం చేశామని పేర్కొన్నారు. ఈ సభ వేదిక కోసం కష్టపడిన పారిశుధ్య సిబ్బందికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు. .నాయకులు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, ఆవిర్భావ దినోత్సవాన్ని ముందుండి నడిపిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, 21 మంది ఎంఎల్‌ఎలు, ఇద్దరు జనసేన ఎంపిలు తదితరులు పాల్గొన్నారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!