చిరంజీవికి యూకే ప్రభుత్వం లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

చిరంజీవికి యూకే ప్రభుత్వం లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించింది. సినీ రంగంలో చిరంజీవి అందిస్తున్న సేవలకు అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంటులో ఈ అవార్డును చిరుకు అందజేయనున్నట్లు పేర్కొంది.

‘పునాదిరాళ్ళు’ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిరు, కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను, అవమానాలను ఎదుర్కొన్నారు. అయితే ఆయన స్వయంకృషితోనే టాలీవుడ్​లోనే టాప్ హీరోగా ఎదిగానంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. నటనలోనే కాకుండా డ్యాన్స్​లోనూ మంచి గ్రేస్​లో ఫ్యాన్​ ఫాలోయింగ్ పెంచుకున్నారు. 

వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యూత్​ను ఉర్రూతలూగించారు. అనేక అవార్డులతో పాటు బాక్సాఫీస్‌ రికార్డులను అందుకున్నారు. ఇప్పటివరకు చిరు 3 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్​లతో పాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను స్వీకరించారు. 

సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్‌ అలాగే 2024లో పద్మవిభూషణ్‌ అందించి గౌరవించింది. ఇటీవల ఆయన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు- 537 పాటలు- 24 వేల స్టెప్పులతో అలరించినందుకు చిరుకు ఈ రికార్డు దక్కడం విశేషం.