ప్రణయ్‌ హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

ప్రణయ్‌ హత్య కేసు నిందితుడికి  ఉరిశిక్ష
తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ కేసులో ఏ2 అయిన సుభాష్‌ శర్మకు మరణ శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు అనే వ్యక్తి 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో యువకుడు ప్రణయ్‌ను హత్య చేయించాడు. 
 
కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి, 8 మందిని నిందితులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో 2019లో 1600 పేజీల ఛార్జిషీట్​ దాఖలు చేశారు. 6 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా, ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

ప్రణయ్‌ హత్య కేసులో ఏ1గా ఉన్న నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏ2 సుభాష్‌ కుమార్‌ శర్మ, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌ శర్మకు బెయిల్‌ రాకపోవడంతో జైళ్లోనే ఉండగా, అస్గర్‌ అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు. 

 
మిగిలిన వారందరూ బెయిల్‌ మీద బయటకు వచ్చారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని, తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించాలని నిందితులు న్యాయస్థానాన్ని వేడుకున్నారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయచూపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

మారుతీరావు కుమార్తె అమృతను ప్రణయ్‌ అనే యువకుడు 2018 జనవరిలో హైదరాబాద్‌లో ప్రేమపెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహంతో రెండు కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాను ప్రణయ్‌తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో అమృత తేల్చిచెప్పింది. 

 
2018 సెప్టెంబరు 14న వైద్య పరీక్షల కోసం భర్త ప్రణయ్​, అత్త ప్రేమలతతో కలిసి అమృత ఆస్పత్రికి వెళ్లింది. హాస్పిటల్​ నుంచి తిరిగి వెళ్తుండగా ప్రణయ్​ను దుండగులు కత్తితో నరికారు. దీంతో ఘటనా స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రణయ్‌ హత్యలో సుభాష్ శర్మ కీలకపాత్ర పోషించడంతో ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది.
 
ఉగ్రవాది అస్గర్‌ అలీకి సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను అమృత తండ్రి హత్య చేయించాడు. ఏడుగురితో ఓ గ్యాంగ్‌ను అస్గర్‌ అలీ ఏర్పాటు చేశాడు. గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరెన్‌ పాండ్యా హత్య కేసులో నిందితులతో కలిపి అస్గర్‌ అలీ గ్యాంగ్ ఏర్పాటు చేసాడు. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్యకేసుల్లో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్థారించి, 2019 జూన్‌ 12 వ తేదీన చార్జిషీట్‌ దాఖలు చేయగా నల్లగొండ ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌ కోర్టు విచారణ మొదలుపెట్టింది.