రూ.18,772 కోట్లతో రీజినల్ రింగు రోడ్డు అంచనాలు సిద్ధం

రూ.18,772 కోట్లతో రీజినల్ రింగు రోడ్డు అంచనాలు సిద్ధం

తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని, ఇప్పటికే రూ. 6,280కోట్లు ఖర్చు చేశామని, ఉత్తర ప్రాంత రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ. 18,772 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. 

రాష్ర్ట ప్రభుత్వం భూములు అందజేస్తే మిగిలిన నిర్మాణాలు కూడా త్వరగా నిర్మాణాలు పూర్తి అవుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు 95 శాతం పూర్తి అవుతున్నా, రాష్ర్ట ప్రభుత్వం భూసేకరణ ద్వారా అందించాల్సిన భూమిని అందించకపోవడంతోనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. 

ఈ విషయంపై పలుమార్లు రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, మరోమారు సీఎంకు లేఖ రాస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పది జాతీయ రహదారులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభానికి రానున్నారని చెప్పారు. అంతేగాక మరిన్ని రహదారులు, కనెక్టివిటీ దారులపై ఆయనకు వివరించానని, కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరులేన్ల విస్తరణ రూ. 300 కోట్లతో పూర్తయ్యిందని, నగరం నుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ప్రజలకు సిగ్నల్స్ ఫ్రీ గా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అంబర్ పేట్ ఫ్లై ఓవర్ కింద రోడ్డు నిర్మాణం కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ర్ట ప్రభుత్వం భూసేకరణ ద్వారా భూమిని అప్పగిస్తే ఈ పనులు మొదలు పెడతామని చెప్పారు.

కాగా, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తాము ఎలా నెరవేరుస్తామని ఆయన ప్రశ్నించారు. ఇంటింటికి స్వదస్తూరితో పోస్టులు పంపి మరీ ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలను నిసిగ్గుగా మోసం చేసే విధానాలకు తెరదీస్తున్నారని మండిపడ్డారు.