వారసత్వ రాజకీయాలపై వేటు.. లక్ష మంది యువత రాజకీయాల్లోకి!

వారసత్వ రాజకీయాలపై వేటు.. లక్ష మంది యువత రాజకీయాల్లోకి!
 
* పట్టణ ప్రాంతాలకు చేరుతున్న నక్సలిజం
 
ఏదైనా విషయంలో యువత పాల్గొనడం అన్ని అడ్డంకులను అధిగమించగలదని స్పష్టం చేస్తూ లక్ష మంది యువతను భారత రాజకీయాల్లోకి తీసుకురావాలనే తన దార్శనిక ప్రణాళికను మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వారసత్వ రాజకీయాలను అంతం చేయడానికి అది దోహదపడుతుందని తెలిపారు.
 
రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్ 2025 – ది లిమిట్‌లెస్ ఇండియాలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ ప్రజాస్వామ్యం, పాలన, ప్రతిభలకు ముప్పుగా అభివర్ణిస్తూ ఇది భారతదేశ పురోగతి, అభివృద్ధిలకు ఆటంకం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి మోదీ, “కాంగ్రెస్ ‘కుటుంబానికే మొదటి’ వైఖరిని కలిగి ఉందని ఆరోపించారు. 
 
వారికి ప్రజలపై నమ్మకం లేదు, వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు, ప్రతిదీ ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతుందని పేర్కొంటూ ఇది దేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని నాశనం చేస్తుందని స్పష్టం చేశారు. రిపబ్లిక్ టివి సదస్సులో గురువారం పాల్గొంటూ భారతీయ యువకులను రాజకీయాల్లోకి తీసుకురావాలని, ఆ యువకులు రాజకీయాల్లోకి మొదటిసారి రావాలని చెప్పారు. 
 
“నేను 1 లక్ష మంది యువకులను రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నాను” అని మోదీ ప్రకటించారు. యువత “తమ కుటుంబంలో మొదటిసారి రాజకీయాల్లోకి రావాలి” అని ఆయన చెప్పారు. “2014 కి ముందు వార్తాపత్రికల ముఖ్యాంశాలు ఎలా ఉండేవో యువతకు తెలియదు. రూ. 10-12 లక్షల కోట్ల స్కామ్‌లు జరిగేవి” అని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 
 
2029 లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, “ఆ యువకుడు 2029 లో ఓటు వేసినప్పుడు, అతనితో పోల్చడానికి ఎటువంటి ఆధారం ఉండదు” అని ప్రధాని పెర్కోన్నారు. దేశాన్ని ముందుకు నడిపించే “ఎక్స్ ఫ్యాక్టర్” గురించి వివరిస్తూ, భారతదేశ భవిష్యత్తు కోసం తన దార్శనికతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచుకున్నారు.
 
“అభివృద్ధి చెందిన భారతదేశంలో యువత అతిపెద్ద వాటాదారులు, వారు నేటి భారతదేశ వృద్ధికి ఎక్స్ ఫ్యాక్టర్” అని ఆయన పేర్కొన్నారు. ప్రయోగం, శ్రేష్ఠత, విస్తరణను సూచించే ‘ఎక్స్’ యొక్క అర్థాన్ని ప్రధాని మోదీ వివరించారు, ఈ మూడు స్తంభాలు భారతదేశపు విజయ మార్గాన్ని ఎలా రూపొందిస్తాయో వివరించారు.
 
ఇలా ఉండగా, దేశంలో అటవీ ప్రాంతాల నుంచి తుడిచిపెట్టుకుపోతున్న నక్సలిజం దురదృష్టవశాత్తూ పట్టణ ప్రాంతాలకు చేరుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.  అయితే, కొన్ని రాజకీయ పార్టీలు వారి విధానాలకు వత్తాసు పలుకుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. “దేశంలో నక్సలిజం అంతిమ దశలో ఉంది. గతంలో నక్సల్స్‌ వల్ల దాదాపు 100కి పైగా జిల్లాల్లు తీవ్రంగా ప్రభావితమయ్యేవి. ఇప్పుడు ఆ జిల్లాల సంఖ్య రెండు డజన్లకు తగ్గింది. క్షేత్ర స్థాయిలో మా ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైంది” అని ప్రధాని తెలిపారు. 

“ఒకవైపు అడవుల నుంచి నక్సలిజాన్ని క్రమంగా నిర్మూలిస్తున్నాం. కానీ, అర్బన్‌ నక్సలిజం నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇది కొత్త సవాళ్లు విసురుతోంది. గతంలో అర్బన్‌ నక్సల్స్‌ను వ్యతిరేకించిన ఒక పార్టీ, ప్రస్తుతం వారిని వెనకేసుకొస్తోంది. అటువంటి పార్టీల నీడన వారు సురక్షితంగా ఉన్నారు. ఈ పార్టీల్లో ఎక్కువగా అర్బన్‌ నక్సల్స్‌ గొంతులే వినిపిస్తున్నాయి. దీనిని బట్టి వారి మూలాలు ఎంతగా పాతుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు'” అంటూ కాంగ్రెస్‌ పార్టీపై మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

మన సంస్కృతిని, అభివృద్ధిని అర్బన్‌ నక్సల్స్‌ వ్యతిరేకిస్తారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రదాడులు, స్లీపర్‌ సెల్స్‌ నుంచి దేశాన్ని కాపాడేందుకు తీవ్రంగా కష్టపడ్డామని, దీంతో ఉగ్రవాదులు అడ్రస్‌ లేకుండా పోయారని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రజల ఆకాంక్షలను చిదిమేసిందని, అందుకే ఆ పార్టీ నుంచి వారు కూడా పెద్దగా ఆశించడం మానేశారని మోదీ విమర్శించారు.

 ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మారాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దశాబ్ద కాలంలో ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. నేటి భారతదేశం పెద్దగా ఆలోచిస్తుందని, పెద్ద లక్ష్యాలను నిర్దేశిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.