ఉత్తరాఖండ్‌ హిమపాత ఘటనలో 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌ హిమపాత ఘటనలో 8 మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం మరో నలుగురి మృతదేహాలను ఆర్మీ సిబ్బంది వెలికితీసింది. దీంతో 60 గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసిందని రక్షణ శాఖ అధికారి మనీశ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. 
 
ఘటనలో మొత్తం 54 మంది బీఆర్‌వో కార్మికులు గల్లంతయ్యారని, ఇందులో 46 మందిని రక్షించామని, 8 మంది చనిపోయారని చమోలీ కలెక్టర్‌ సందీప్‌ తివారీ చెప్పారు. గత శుక్రవారం బీఆర్‌వో క్యాంప్‌ వద్ద పెద్ద మంచుచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఆకస్మిక హిమపాత ఘటనలో గల్లంతైనట్లు భావించిన ఐదుగురిలో ఒకరు క్షేమంగా ఇంటికి చేరుకోగా మిగిలిన నలుగురూ మృతి చెందారు. 
 
నిర్వీరామంగా సహాయక చర్యలు చేపట్టిన జవాన్లు, ఇరత సహాయక బలగాలు ఆదివారం మధ్యాహ్నం చివరి మృతదేహన్ని కూడా గుర్తించారు.  రాష్ట్రంలోని చమోలి జిల్లాలో మనా గ్రామం సమీపంలో శుక్రవారం సంభవించిన ఆకస్మిక హిమపాతంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బిఆర్‌ఒ) శిబిరం కూరుకుపోయిన సంగతి తెలిసిందే. 
 
ఈ శిబిరంలో 55 మంది ఉన్నారని అధికారులు ముందుగా భావించారు. అయితే ఇందులో ఒక కార్మికుడు ఎవరికి చెప్పకుండా అనధికార సెలవులో సురక్షితంగా సొంత ఊరికి చేరుకున్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో 54 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగించారు. శనివారం ఉదయానికే 50 మందిని రక్షించి జోషిమఠ్‌లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. 
 
అయితే వీరిలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం ఉదయం మంచులో నలుగురి మృతదేహాలను గుర్తించారు. కాగా చికిత్స పొందుతున్న 46 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.