సెబి మాజీ చైర్‌పర్సన్‌ మాధబి పురీబచ్‌పై ఎఫ్ఐఆర్

సెబి మాజీ చైర్‌పర్సన్‌ మాధబి పురీబచ్‌పై ఎఫ్ఐఆర్
స్టాక్ మార్కెట్ అవకతవకలు, రెగ్యులేటరీ ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై ‘సెబి’ మాజీ చైర్‌పర్సన్ మాధబి పురీ బచ్, మరో ఐదుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అవినీతి నిరోధక విభాగానికి (ఎసిబి) ముంబై ప్రత్యేక కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని, 30 రోజుల్లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశాల జారీ చేసింది.  అయితే, ఈ ఆదేశంపై న్యాయపోరాటం చేయనున్నట్లు సెబీ ప్రకటించింది.
 
ఇతర అధికారుల జాబితాలో బీఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సుందర రామన్ రామమూర్తి, మాజీ బీఎస్‌ఈ ఛైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సెబీ జీవితకాల సభ్యులు అశ్వనీ భాటియా, అనంత్ నారాయణ్.జి, కమ్లేశ్ చంద్ర వర్షనే ఉన్నారు. అభియోగాల ఆధారంగా ఆరుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలంటూ ముంబయి రీజియన్‌లోని ఏసీబీ వర్లీ విభాగానికి జడ్జి ఆదేశాలిచ్చారు.
 
ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం, సెబీ చట్టం, వర్తించే ఇతరత్రా చట్టాలకు సంబంధించిన సెక్షన్లతో అభియోగాలను నమోదు చేయాలని ఆదేశించారు. ‘స్టాక్‌ మార్కెట్‌ మోసం, ఉల్లంఘన విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం’ అని ఎసిబి ప్రత్యేక కోర్టు జడ్జి శశికాంత్‌ ఏక్‌నాథరావు బంగర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
 
మాధబి బచ్ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు, రెగ్యులేటరీ ఉల్లంఘనలు, అవినీతికి పాల్పడ్డారని దీనిపై విచారణకు ఆదేశించాలని థానేకు చెందిన జర్నలిస్టు సవన్ శ్రీవాత్సవ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. సెబి అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని, మార్కెట్లో అవకతవకలకు, కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదుదారు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థతో కుమ్మక్కై ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

పోలీస్ స్టేషన్‌కు, సంబధింత రెగ్యులేటరీ సంస్థలను పలుమార్లు అప్రోచ్ అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. ఆన్ రికార్డ్ మెటీరియల్‌ను పరిశీలించిన కోర్టు  ఐపీసీలోని నిబంధనలు, అవినీతి నిరోధక చట్టం, సెబీ చట్టం, ఇతర చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

కాగా, అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టినట్టు గత ఏడాది ఆగస్టులో హిండెన్‌బర్క్ చేసిన పోస్ట్ కూడా సంచలనమైంది. ఇందులో ఆమె భర్త ధావలె బచ్‌కు కూడా పెట్టుబడులున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను బచ్ దంపతులు తోసిపుచ్చారు. సెబీలో చేరడానికి ముందే తాము పెట్టుబడులు పెట్టామని తెలిపారు. హిండెన్‌బర్క్ ఇటీవల తమ బిజినెస్‌లను మూసేస్తున్నట్టు ప్రకటించింది.