కెనడా వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు

కెనడా వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు

ఎలాన్‌ మస్క్‌ కెనడా పౌరసత్వానికి ముప్పు 

కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ రెఫ్యూజీ ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్స్‌ పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా బోర్డర్‌ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్స్‌ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్‌ వీసా (టీఆర్‌వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. 

ఇతర దేశాల నుంచి కెనడాకు విద్య, ఉద్యోగాలు, తాత్కాలిక బస కోసం వెళ్లేవారిపై, మరీ ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం పడుతుంది. వివిధ కారణాలను చూపించి, ఈటీఏ, టీఆర్‌వీ, వర్క్‌ పర్మిట్‌, స్టడీ పర్మిట్లను కెనడా ఇమ్మిగ్రేషన్‌, బోర్డర్‌ అధికారులు రద్దు చేయవచ్చు. తప్పుడు సమాచారం ఇవ్వడం, క్రిమినల్‌ రికార్డు ఉండటం వంటి కారణాలను చూపి రద్దు చేయవచ్చు. 

నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కెనడా నుంచి తిరిగి వెళ్లిపోతానని వీసాదారు సంబంధిత అధికారికి నమ్మకం కలిగే విధంగా చెప్పలేకపోయినా ఆ పర్మిట్‌ను రద్దు చేయవచ్చు. పర్మిట్లు రద్దయితే కెనడా నౌకాశ్రయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు. మరోవంక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ కెనడా పౌరసత్వానికి ఎసరు తెచ్చిపెట్టింది. 

మస్క్‌ కెనడా పౌరసత్వాన్ని రద్దు చేయాలని 1.5 లక్షల మంది పార్లమెంటరీ పిటిషన్‌పై సంతకం చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌నకు సలహాదారు, డోజ్‌ హెడ్‌గా వ్యవహరిస్తున్న మస్క్‌ కెనడా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఫిబ్రవరి 28న హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో పార్లమెంటరీ పిటిషన్‌ దాఖలైంది. మస్క్‌ కెనడా పాస్‌పోర్ట్‌, పౌరసత్వాన్ని వెంటనే రద్దు చేయాలని తమ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడోని పిటిషన్‌లో కోరారు. 

ఆదివారం రాత్రి నాటికి పిటిషన్‌పై సంతకం చేసిన వారి సంఖ్య 1,57,000కి చేరుకుంది. మస్క్‌ తల్లి ‘మేయి మస్క్‌’ కెనడియన్‌. తద్వారా ఆయనకు కెనడా పౌరసత్వం కూడా లభించింది. కెనడాపై డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న ధోరణి ఆ దేశస్థుల్ని ఆగ్రహానికి గురిచేస్తున్నది. కెనడా దిగుమతులపై టారిఫ్‌లు పెంచుతానని, అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలంటూ కెనడాపై ట్రంప్‌ బెదిరింపులకు దిగటం కెనడియన్లను తీవ్రంగా రెచ్చగొట్టింది.

కొత్త వీసా రూల్స్ కారణంగా భారతీయ విద్యార్ధులు, కార్మికులు, పర్యాటకులపై భారీ ప్రభావం పడనుంది. ఇప్పటికే గుర్తించిన మేరకు పదివేల మంది భారతీయ విద్యార్థులు, కార్మికులు వీసా రద్దు ముప్పు ఎదుర్కొంటున్నారు. కెనడాలో మొత్తం 4.2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అలాగే భారతీయ వలసదారులకు ఆతిధ్యమిస్తున్న టాప్ దేశాల్లో కెనడా కూడా ఉంది. 

ఇప్పుడు తాజా రూల్స్ తో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర వీరి వీసాలు తిరస్కరిస్తే వెంటనే స్వదేశానికి తిరిగి రావాల్సిందే. అలాగే కెనడాలో ఉన్నప్పుడు అనుమతి రద్దు చేస్తే .. దేశం వదిలివేయడానికి నోటీసు జారీ చేస్తారు. ఇలాంటి బాధితులు ఇప్పటికే చెల్లించిన ఫీజులు, రుణాలు, తనఖాలు, అద్దెల వాపసులపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.