ఎన్నికల ముందు ఉచిత పథకాల ప్రకటన విధానాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆక్షేపించింది. ఉచిత రేషన్, నగదు అందుతున్నందున పని చేయడానికి జనం సుముఖంగా లేరని కోర్టు వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు గూడు కల్పన హక్కు సంబంధిత పిటిషన్‌పై విచారణ సందర్భంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, అగస్టీన్ జార్జి మసీహ్‌తో కూడిన ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేసింది.
“దురదృష్టవశాత్తు ఈ ఉచితాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఉచిత రేషన్లు లభిస్తున్నాయి. వారు ఎటువంటి పని చేయకుండానే ఆ మొత్తాన్ని పొందుతున్నారు. వారిపై(పౌరులపై) మీకున్న(ప్రభుత్వాలకు) శ్రద్ధకు మేము అభినందిస్తున్నాము. కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయడం మంచిది కాదా?” అని జస్టిస్ గవాయ్ అభిప్రాయం వెలిబుచ్చారు.
‘వారి పట్ల మీ ఆందోళనను మేము గుర్తిస్తున్నాం. అయితే, వారిని సమాజంలో ప్రధాన స్రవంతిలో భాగం చేసి, దేశ అభివృద్ధికి పాటుపడేందుకు వారిని అనుమతించడం మెరుగు అవుతుంది కదా’ అని బెంచ్ పేర్కొన్నది.
పేదరిక నిర్మూలన పథకం ఖరారు ప్రక్రియలో కేంద్రం ఉన్నదని, అది పట్టణ ప్రాంత నిరాశ్రయులకు గూడు కల్పించడంతో సహా వివిధ సమస్యలను పరిష్కరించగలదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బెంచ్‌తో చెప్పారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఎప్పటి నుంచి వర్తిస్తుందో కేంద్రం నుంచి ధ్రువీకరణ పొందవలసిందని అటార్నీ జనరల్‌ను బెంచ్ కోరింది.
సర్వోన్నత న్యాయస్థానం ఆరు వారాల తరువాత ఈ విషయం విచారిస్తామని ప్రకటించింది. జనవరిలోనూ సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఎన్నికలు రాగానే లాడ్లీ బెహెన్‌తో పాటు పలు పథకాలను ప్రకటించి.. సొమ్ములను పంచిపెడతారని మండిపడింది. ఢిల్లీలో ఇప్పుడు ఓ పార్టీ రూ.2,500 ఇస్తామంటే, ఇంకో పార్టీ తాము దీనికి రెట్టింపు ఇస్తామని హామీ ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉచితాలకు డబ్బులు ఉంటాయని, కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం ఉండవని తూర్పారబట్టింది. గతంలో సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాథ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సమయంలో ఉచితాలు అంటే ఏమిటి? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిని తాము అడ్డుకోలేమని తేల్చిచెప్పింది. అంతేకాదు, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీరు వంటివి సౌకర్యాలు ఉచితాలుగా పరిగణించవచ్చా? ప్రజల హక్కా..? అని ప్రశ్నించింది
కాగా, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ పోటాపోటీగా ఉచితాలను ప్రకటించాయి. దీనిని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలు.. నగదు ఆధారిత పథకాలపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. దీనిని పరిశీలించిన హైకోర్టు. అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది.

More Stories
నేపాల్‌లో జెన్‌జెడ్ నిరసనలతో 42 బిలియన్ డాలర్ల నష్టం
నలుగురు ఇండిగో అధికారులు సస్పెండ్
తిరువనంతపురం, కోచి, కన్నూర్, త్రిసూర్ లలో హంగ్ మున్సిపాలిటీలు!