కృత్రిమ మేధాతో ఉద్యోగాలు పోతాయ‌నే అపోహ మాత్ర‌మే

కృత్రిమ మేధాతో ఉద్యోగాలు పోతాయ‌నే అపోహ మాత్ర‌మే

కృత్రిమ మేధా(ఏఐ) వ‌ల్ల ఉద్యోగాలు పోతాయ‌నే భ‌యాలు విడ‌నాడాల‌ని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. భ‌యం వీడితేనే మ‌నం మరింత ముందుకు వెళ్ల‌గ‌ళ‌మ‌ని చెప్పారు.  ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని పారిస్‌ వేదికగా జరిగిన ఎఐ యాక్షన్‌ కమిటీ సమావేశానికి సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం ప్రయాణం సులభతరం చేయడం, వేగవంతమైన ప్రపంచాన్ని రూపొందించడంలో ఎఐ సహాయపడుతుందని చెప్పారు. ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న స్వభావాన్ని , దాని బహుళ ప్రయోజనాలను పొందేందుకు జాతీయ ప్రభుత్వాల సమిష్టి గా ప‌నిచేయాల్సిన అవ‌స‌రాన్ని నొక్కిచెప్పారు. 

సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించడం, అటువంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావ‌డం అవ‌స‌ర‌మ‌ని ప్రధాని తెలిపారు. ఏఐ పరిజ్ఞానంతో వచ్చే వ్యత్యాసంపై జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 

“ఏఐ వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి. సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనేది వదంతే. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నతావకాశాలుంటాయి. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా భారత్ ముందుకెళ్తుంది” అని ప్రధాని చెప్పుకొచ్చారు.

ఎఐ అపూర్వమైన స్థాయిలో, వేగంతో అభివృద్ధి చెందుతోందని భరోసా వ్యక్తం చేశారు. కొత్త ఆవిష్కరణను ప్రోత్సహించడం వల్ల ప్రపంచం మరిన్ని ప్రయోజనాల పొందుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు కొత్త సాంకేతికకు అన్ని దేశాలు సరైన ప్రొత్సాహం ఇవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. లక్షలాది మంది జీవితాలను మార్చడానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయంతో పాటు మరెన్నో రంగాల్లో ఎఐని అనుసంధానించాలని సూచించారు.

మనమంతా మన వనరులను, ప్రతిభను ఒకచోట చేర్చుకోవాలని ప్రధాని మోదీ ఏఐ సమ్మిట్‌లో వెల్లడించారు. నమ్మకమైన, పారదర్శకతను పెంపొందించే ఓపెన్ సోర్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని, పక్షపాతం లేని నాణ్యమైన డేటాసెట్‌లను అభివృద్ధి చేసి ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చాలని చెప్పారు. “ఏఐ అనేది ప్రజలే కేంద్రీకృతంగా పని చేసేలా ఉండాలి. సైబర్ భద్రత, తప్పుడు సమాచారం, నకిలీలకు సంబంధించిన ఆందోళనలను మనమే పరిష్కరించాలి” అని తెలిపారు.

సాంకేతికత ప్రభావవంతంగా, మానవాళికి ఉపయోగకరంగా ఉండాలంటే అది స్థానిక వ్యవస్థల్లో భాగం కావాలని ప్రధాని చెప్పారు. ఎఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భావన సరికాదని, సాంకేతికత కారణంగా శ్రామిక శక్తి కనుమరుగైపోదని చరిత్ర చెబుతోందని ఆయన తెలిపారు. కాలంతో పాటు ఉద్యోగాల స్వభావం మారుతుందని, కొత్త తరహా ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 

ఈ ఆందోళనను పరిష్కరించేదుకు ఎఐ ఆధారిత భవిష్యత్తు కోసం ప్రజల్లో నైపుణ్యం పెంచేలా, సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించాలని, ఆ దిశగా పెట్టుబడులు పెట్టాలని ప్రధాని వివరించారు.  భారత్‌ 140 కోట్ల కంటే ఎక్కువ మందికి తక్కువ ఖర్చుతో సాంకేతికతను అందిస్తోందని ప్రధాని గుర్తు చేశారు. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో దేశంలో మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు.